జగన్ పార్టీలోకి టిడిపి ఎమ్మెల్యే?

జగన్ పార్టీలోకి టిడిపి ఎమ్మెల్యే?

తాజా పరిణామాల నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్‌కు అత్యంత సన్నిహితుడైన తెలుగుదేశం  గుడివాడ శానససభ్యుడు కొడాలి నాని వైయస్సార్ కాంగ్రెసు పార్టీలోకి జంప్ చేసే అవకాశాలున్నట్లు ప్రచారం జరుగుతోంది. వైయస్ జగన్‌తో కొడాలి నాని సన్నిహిత సంబంధాలు నెరుపుతున్నట్లు చెబుతున్నారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి పట్ల ఆయన అసంతృప్తిగా ఉన్నట్లు గత కొంత కాలంగా ప్రచారం జరుగుతోంది.

ఆయన వైయస్సార్ కాంగ్రెసులో జంప్ చేస్తారనే ప్రచారం జరగడానికి ఆధారాలు కూడా ఉన్నాయి. గుడివాడ నియోజకవర్గంలో వైయస్ జగన్‌తో కలిసి కొడాలి నాని ఉన్న ఫొటోలతో కూడిన ఫ్లెక్సీలు వెలిశాయి. ఇవి అకస్మాత్తుగా వెలిసినవి ఏమీ కాదని, ముందస్తు ప్రణాళిక ప్రకారమే వెలిశాయని అంటున్నారు. కొద్ది రోజుల్లో కొడాలి నాని వైయస్సార్ కాంగ్రెసు పార్టీలోకి వెళ్లే అవకాశాలున్నట్లు చెబుతున్నారు.

తెలుగుదేశం పార్టీలో కృష్ణా జిల్లాకు చెందిన జూనియర్ ఎన్టీఆర్ సన్నిహితులు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు చాలా కాలంగా ప్రచారం జరుగుతోంది. కృష్ణా జిల్లా అధ్యక్షుడు దేవినేని ఉమా మహేశ్వర తీరు పట్ల వారు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. పైగా, పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఉమామహేశ్వర రావుకు పూర్తి అండదండలు అందిస్తున్నారు. ఈ స్థితిలో తమకు తగిన ప్రాధాన్యం ఇవ్వడం లేదని జూనియర్ ఎన్టీఆర్ వర్గానికి చెందిన నాయకులు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు చెబుతున్నారు.

గతంలో విజయవాడ  తెలుగుదేశం నాయకుడు వల్లభనేని వంశీ వైయస్ జగన్‌తో రోడ్డుపై మంతనాలు జరపడం తీవ్ర సంచలనం సృష్టించింది. వంశీతో పాటు కొడాలి నాని కూడా వైయస్సార్ కాంగ్రెసు పార్టీలోకి వెళ్తారనే ప్రచారం అప్పట్లో ముమ్మరంగా సాగింది. అయితే, ఆ తర్వాత ఆ వ్యవహారం సద్దుమణిగింది.