ఓటమి నెపం సిబిఐ పైకి

 ఓటమి నెపం సిబిఐ పైకి

 ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు, రవాణా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఇంత హఠాత్తుగా ఢిల్లీ వెళ్లడంపై పలు రకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఆయన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పైన, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సిబిఐ) పైన ఫిర్యాదు చేసేందుకు వెళ్లి ఉండవచ్చుననే వాదనలు వినిపిస్తున్నాయి. బొత్స ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న విషయం తెలిసిందే. ఇటీవల జరిగిన ఉప ఎన్నికలలో కాంగ్రెసు ఘోర పరాజయం పాలైన విషయం తెలిసిందే.

దీనిపై నివేదిక ఇవ్వడానికి వెళ్లారని తెలుస్తోంది. మంగళవారం మీడియాతో మాట్లాడిన బొత్స తాను నివేదిక ఇవ్వడానికి రాలేదని చెప్పినప్పటికీ.. ఉప ఎన్నికలపై అధిష్టానానికి వివరణ ఇచ్చేందుకే వచ్చి ఉంటారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆయన ప్రధానంగా  ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పైన ఫిర్యాదు చేసేందుకు వెళ్లారని అంటున్నారు. కిరణ్ వైఖరి వల్ల గెలవాల్సిన కొన్నిచోట్ల ఓడిపోయామని ఆయన ఫిర్యాదు చేసి ఉంటారని అనుమానిస్తున్నారు.

కిరణ్ అనవసరంగా ఆళ్ల నానిని ప్రోత్సహించారని, ఇప్పుడు ఆయన జగన్ వైపు మొగ్గు చూపుతున్నారని, తన జిల్లా బొబ్బిలి ఎమ్మెల్యే సుజయ కృష్ణ రంగారావును రెచ్చగొట్టారని అలాగే వరంగల్‌లోని పరకాల నియోజకవర్గంలో కిరణ్ వర్గం గండ్ర వెంకటరమణ రెడ్డి దెబ్బతీశారని.. ఇలా ఆయా నియోజకవర్గాలలో వైఫల్యాలను కిరణ్ వర్గానికి అంటగట్టేందుకు బొత్స ఢిల్లీ వెళ్లారని అంటున్నారు.

ఈ విషయాన్ని ముందే పసిగట్టిన కిరణ్ వర్గం బొత్స కంటే ముందే వెళ్లి ఢిల్లీకి వెళ్లారని చెబుతున్నారు. మంత్రులు ఏరాసు ప్రతాప్ రెడ్డి, టిజి వెంకటేష్ పార్టీ అధిష్టానానికి ఉప ఎన్నికలలో ఓటమిపై వివరణ ఇచ్చినట్లుగా చెబుతున్నారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డిపై అభిమానం, జగన్ అరెస్టు, విజయమ్మ, షర్మిలల ప్రచారంతో వచ్చిన సానుభూతి వల్లే ఓడామని వారు వివరించారని తెలుస్తోంది.

మరోవైపు సిబిఐ పైన కూడా ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీకి ఫిర్యాదు చేయడానికి వెళ్లి ఉండవచ్చునని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. ఉప ఎన్నికలకు ముందు సిబిఐ అత్యుత్సాహంతో జగన్‌ను అరెస్టు చేయడం వల్లే వ్యతిరేక ఫలితాలు వచ్చాయని ఆయన ఢిల్లీ పెద్దలకు చెప్పారని అంటున్నారు. జగన్‌ను అరెస్టు చేయకుంటే కాంగ్రెసు కనీసం పది స్థానాలను కైవసం చేసుకుని ఉండేదని పలువురు కాంగ్రెసు నేతలు అభిప్రాయపడుతున్నారు.

ఇలా చెబుతున్న వారంతా బొత్స సూచనల మేరకే అంటుండవచ్చుననే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆలాగే రామచంద్రాపురం, నర్సాపురంలలో కాంగ్రెసు గెలుపులో రాజ్యసభ సభ్యుడు చిరంజీవి పాత్ర పైనా ఆయన సోనియా గాంధీ దృష్టికి తీసుకు వెళ్లనున్నారని అంటున్నారు.