'జగన్ అవినీతి' టిడిపి కొంప ముంచిందా?

 'జగన్ అవినీతి' టిడిపి కొంప ముంచిందా?

 తెలుగుదేశం పార్టీ సొంత తప్పిదాల కారణంగానే ఉప ఎన్నికలలో బొక్క బొర్లా పడిందనే వాదనలు వినిపిస్తున్నాయి. ఉప ఎన్నికలలు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ 15 స్థానాలలో జెండా ఎగురవేస్తే.. కాంగ్రెసు రెండు స్థానాలలో కాస్త పరువు నిలుపుకుంది. కానీ తెలుగుదేశం మాత్రం పూర్తిగా చతికిల పడింది. ఇందుకు కారణం సొంత వైఖరే అని అంటున్నారు. కాంగ్రెసు పట్ల, వైయస్ జగన్మోహన్ రెడ్డి పట్ల ఆ పార్టీ తీరు వల్లే టిడిపి ఓటమికి కారణమని అంటున్నారు.

టిడిపి ఉప ఎన్నికలలో ప్రధానంగా  వైయస్ జగన్మోహన్ రెడ్డిఅవినీతినే ప్రస్తావించింది. అప్పుడప్పుడు కాంగ్రెసు పార్టీ పైన విమర్శలు చేసినప్పటికీ అవినీతినే అస్త్రంగా చేసుకొని జగన్ పైన ఆ తర్వాత మంత్రుల పైన టిడిపి విరుచుకుపడింది. రాజకీయాలలో అవినీతి అనేది ప్రజలకు మామూలైపోయిన ఇలాంటి పరిస్థితులలో ఇంకా అవినీతినే ప్రధాన అస్త్రంగా చేసుకొని ప్రచారం చేయడం వారి కొంప ముంచిందంటున్నారు.

జగన్ అవినీతికి పాల్పడటం అక్షరాలా నిజమని, కానీ... జనం అవినీతి గురించి పెద్దగా పట్టించుకోలేదనే విషయాన్ని గ్రహించలేక పోయారని అంటున్నారు. అదేపనిగా అదే అంశంపై ప్రచారం చేసినందువల్ల జగన్‌ను కసిగా వెంటపడుతున్నారనే అభిప్రాయం కలిగిందని, దీంతో అసలు విషయం తెర మరుగైందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. టిడిపి వైఖరి కారణంగా వైయస్సార్ కాంగ్రెసు ప్రచారం చేసినట్లుగా.. జగన్‌ను కాంగ్రెసు, టిడిపి కలిసి దెబ్బ తీయాలని చూస్తున్నాయన్న వ్యాఖ్యలు ప్రజలకు బాగా చేరువయ్యాయని అంటున్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలు, జగన్ అవినీతి, తాము గతంలో సాగించిన సుపరిపాలన... ఇలాంటి అనేక అంశాల్లో దేనిని ప్రధానాశం చేయాలనే విషయంలో స్పష్టత లేకపోయిందని అంటున్నారు. జగన్ వల్ల జనానికి ఒరిగిందేమీ లేదని, కానీ... వైయస్ ప్రవేశపెట్టిన కొన్ని సంక్షేమ పథకాలే జనాన్ని జగన్‌కు దగ్గర చేశాయనే అభిప్రాయాలు వెలువడుతున్నాయి. టిడిపి కూడా గతంలో మేం తాము ఏం చేశామో.. ఇక ముందు ఏం చేస్తామో.. చెప్పడంలో విఫలమైందంటున్నారు. త్రిముఖ పోరులో... సంప్రదాయబద్ధంగా పడే ఓట్లు మినహా, మిగిలిన ఓట్లు తమకు అనుకూలంగా సంఘటితం కాలేదని చెబుతున్నారు.