విజయమ్మ కోసం మమతా ప్రయత్నాలు

 వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవ అధ్యక్షురాలు, పులివెందుల శాసనసభ్యురాలు వైయస్ విజయమ్మను తృణమూల్ కాంగ్రెసు పార్టీ అధినేత్రి,  పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కలిసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఉప ఎన్నికల ఫలితాలలో కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి స్థాపించిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అభ్యర్థులు ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే.

మొత్తం పద్దెనిమిది అసెంబ్లీ, ఒక పార్లమెంటు నియోజకవర్గాలలో 16 అసెంబ్లీతో పాటు పార్లమెంటు స్థానాన్ని వైయస్సార్ కాంగ్రెసు కైవసం చేసుకుంది. రెండు స్థానాలలో కాంగ్రెసు పార్టీ గెలుపొందింది. జూలైలో రాష్ట్రపతి ఎన్నికలు ఉన్న విషయం తెలిసిందే. రాష్ట్రపతి ఎన్నికలలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ మద్దతు కోసం మమతా బెనర్జీ వైయస్ విజయమ్మను కలిసేందుకు ప్రయత్నిస్తున్నట్లుగా సమాచారం.

రాష్ట్రపతి అభ్యర్థిగా కాంగ్రెసు పార్టీ ప్రతిపాదించిన ప్రణబ్ ముఖర్జీ, హమీద్ అన్సారీలను మమత అంగీకరించడం లేదు. సమాజ్‌వాది పార్టీతో కలిసి ఆమె మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం, ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్, కమ్యూనిస్టు యోధుడు సోమనాథ్ ఛటర్జీ పేర్లను తెర పైకి తీసుకు వచ్చారు. అయితే ఆమె ప్రతిపాదనను కాంగ్రెసు తిప్పి కొట్టింది. కలాం, సోమనాథ్ పేర్లను తాము ఎప్పుడో పక్కకు పెట్టామని.. ఇక మన్మోహన్ సింగ్ 2014 వరకు ప్రధానమంత్రిగా కొనసాగుతారని చెప్పారు.

మమతా బెనర్జీ ప్రతిపాదనను అంగీకరించేది లేదని కాంగ్రెసు స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో కాంగ్రెసు ప్రణబ్ లేదా హమీద్ అన్సారీని గెలిపించుకోవడం కోసం మమతను పక్కన పెట్టి మిగిలిన పార్టీలతో తీవ్రంగా చర్చలు జరుపుతోంది. వామపక్షాల మద్దతు కూడా కూడగట్టేందుకు కాంగ్రెసు ప్రయత్నాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో మమత కూడా తాను ప్రతిపాదించిన అభ్యర్థులను రంగంలోకి దింపేందుకు వివిధ పార్టీలతో చర్చలు జరిపే అవకాశాలు ఉన్నాయి.

అబ్దుల్ కలాంకు ఎన్డీయే గ్రీన్ సిగ్నల్ ఇస్తోంది. మమత కూడా కలాం పేరు తెరపైకి తీసుకు వచ్చింది. ఈ నేపథ్యంలో అబ్దుల్ కలాం అభ్యర్థిత్వాన్ని ఎన్డీయే, తృణమూల్ కలిసి బలపరిచే అవకాశముంది. సమాజ్‌వాది పార్టీ కూడా మమతతో గొంతు కలుపుతోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెసు నుండి బయటకు వచ్చి సొంత కుంపటి పెట్టుకొని ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో దూసుకుపోతున్న వైయస్సార్ కాంగ్రెసు వైపు మమతా బెనర్జీ దృష్టి సారించారు. 15+1 స్థానాలు ఉన్న జగన్ పార్టీ కూడా రాష్ట్రపతి ఎన్నికలలో ప్రధానం కానుంది.