చిరంజీవి వర్సెస్ బొత్స సత్తిబాబు

చిరంజీవి వర్సెస్ బొత్స సత్తిబాబు

 రాష్ట్ర కాంగ్రెసు వ్యవహారాలు చిరంజీవి వర్సెస్  పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణగా మారినట్లు భావిస్తున్నారు. చిరంజీవి పార్టీ పగ్గాలను తన చేతిలోకి తీసుకోవడానికే ఉప ఎన్నికల ఫలితాలపై తీవ్రమైన వ్యాఖ్యలు చేసినట్లు భావిస్తున్నారు. తనకు అప్పగిస్తే ఏమిటో చూపిస్తానని ఆయన అనడం బొత్స సత్యనారాయణకు తీవ్ర ఆగ్రహం తెప్పించినట్లు తెలుస్తోంది. తిరుపతి అభ్యర్థి ఎంపిక విషయంలో చిరంజీవి చేసిన వ్యాఖ్య కూడా బొత్స సత్యనారాయణకు కోపం తెప్పించినట్లు తెలుస్తోంది.

అంత వరకు చిరంజీవిపై విమర్శలు వస్తే ధాటిగా ఎదుర్కున్న బొత్స సత్యనారాయణ వర్గం ఇప్పుడు అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నట్లు చెబుతున్నారు. పైగా, చిరంజీవి వ్యాఖ్యలను తప్పు పడుతున్నట్లు తెలుస్తోంది. ఉప ఎన్నికల్లో పార్టీ గెలిచిన రెండు స్థానాలూ తమవేనని, ఆ విజయం తమకే దక్కుతుందని, తిరుపతిలో పరాజయానికి తాను సూచించిన అభ్యర్థికి టిక్కెట్టు ఇవ్వకపోవడమే కారణమని చిరంజీవి చేసిన వ్యాఖ్యలు తనకు గురిపెట్టినట్లు బొత్స భావిస్తున్నట్లు చెబుతున్నారు.

చిరంజీవి వ్యాఖ్యలను బొత్స సత్యనారాయణ ఖండించారు. అంతే కాకుండా, ఒకరు చేసిన వ్యాఖ్యలపై తాను స్పందించాల్సిన అవసరం లేదని ఆయన కాస్తా ఘాటుగానే మీడియా ప్రతినిధుల సమావేశంలో చిరంజీవి వ్యాఖ్యలపై అన్నారు. ముఖ్యమంత్రి, చిరంజీవి ఇద్దరూ సూచించిన వ్యక్తికే తిరుపతి టిక్కెట్టు ఇచ్చామని, ఈ అంశం తనకు తెలియకుండానే జరిగిందని చిరంజీవి ప్రకటిస్తే దానిని నేను ఖండిస్తున్నానని ఆయన అన్నారు.

ప్రజారాజ్యం, కాంగ్రెసు పార్టీల కార్యకర్తల మధ్య సమన్వయం ఇంకా సాధించేలేదని, ఇందుకు కొన్ని చోట్ల కాంగ్రెస్ శ్రేణులు సహకరించటం లేదనే చిరంజీవి వాదనను కూడా బొత్స వర్గం కొట్టిపారేస్తోంది. ఎన్నికల షెడ్యూల్ విడుదలకు ముందే నర్సాపురం, రామచంద్రాపురం నియోజకవర్గాల్లో పిసిసి అధ్యక్షుడి హోదాలో బొత్స మూడేసి రోజుల చొప్పున విస్తృతంగా పర్యటించి, శ్రేణుల్ని సమాయత్తం చేసిన సంగతి గుర్తుంచుకోవాలని ఆయన వర్గం సూచిస్తోంది. పైగా, పీఆర్పీ కోటాలో మంత్రి పదవులు పొందిన గంటా శ్రీనివాసరావు, రామచంద్రయ్య వరుసగా పాయకరావుపేట, రాజంపేట నియోజకవర్గాలకు ఇన్‌చార్జిలుగా ఉన్నా, అక్కడ కాంగ్రెస్ భారీ మెజారిటీతో ఎందుకు ఓడిపోయిందని ప్రశ్నిస్తున్నారు.

పరిస్థితిని సరిగా అర్థం చేసుకోకుండా చిరంజీవి మాట్లాడారని బొత్స సత్యనారాయణ వర్గం అంటోంది. మొత్తం మీద, చిరంజీవికి, బొత్స సత్యనారాయణకు మధ్య ప్రచ్ఛన్న యుద్ధం సాగుతున్నట్లు చెబుతున్నారు.