'జగన్' గెలుపుతో మారనున్న పరిణామాలు?

'జగన్' గెలుపుతో మారనున్న పరిణామాలు?

 ఉప ఎన్నికల ఫలితాల విడుదలకు ఇక ఒకే రోజు గడువు ఉండటంతో ఏం జరగనుందనే ఉత్కంఠ సర్వత్రా కనిపిస్తోంది. ఈ ఉప ఎన్నికలు 2014 ఎన్నికలకు సెమీఫైనల్స్‌గా అన్ని పార్టీలు భావించాయి. ఈ ఎన్నికలు అత్యంత ప్రతిష్టాత్మకం కావడంతో అభ్యర్థులతో పాటు ఆయా పార్టీ ముఖ్య నేతల గుండెల్లోనూ రైళ్లు పరుగెడుతుండవచ్చు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఎన్ని స్థానాలు గెలుచుకుంటుంది, ఎవరెవరు ఎంత మెజార్టీతో గెలుస్తారు, గెలిస్తే జగన్ ఏం చేస్తారు, కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలు ఎన్ని స్థానాలలో గెలుస్తాయనే చర్చ ఇప్పుడు జరుగుతోంది.

ప్రస్తుతం ఉప ఎన్నికలు జరిగిన పద్దెనిమిది అసెంబ్లీ నియోజకవర్గాలలో తెలంగాణ సెంటిమెంట్ దృష్ట్యా పరకాలను, చిరంజీవి స్థానం కావడంతో తిరుపతిని మినహాయిస్తే జగన్ మిగిలిన పదహారు స్థానాలను గెలుచుకుంటారా లేక మొత్తానికి మొత్తం స్థానాలను తన కైవసం చేసుకుంటారా అలా కాకుండా కొన్ని సర్వేలలో చెప్పినట్లు 12కు కాస్త అటు ఇటుగా గెలుచుకుంటారా అనే చర్చ ప్రధానంగా జరుగుతోంది. జగన్ గెలుచుకున్న స్థానాలను బట్టి రాజకీయాలలో ఎలాంటి పరిణామాలు ఉంటాయోనని రాజకీయ పండితులు లెక్కలు కడుతున్నారు.

జగన్ అన్ని స్థానాలను క్వీన్ స్వీప్ చేస్తే రాష్ట్ర ప్రభుత్వ మనుగడ ప్రశ్నార్థకంగా మారవచ్చుననే అభిప్రాయాలు వెలువడుతున్నాయి. జగన్ ఇబ్బందులలో ఉన్నప్పుడు ప్రజాప్రతినిధులు ఆయన వైపు మొగ్గు చూపారు. ఇక మొత్తానికి మొత్తం స్థానాలు గెలిస్తే చాలామంది ఆయన వైపు మొగ్గు చూపే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. దీంతో ప్రభుత్వం ఇబ్బందుల్లో పడే అవకాశముంది. అలాంటి పరిస్థితి ఎదురైతే అసెంబ్లీని రద్దు చేయడం, రాష్ట్రపతి పాలన విధించడం, మధ్యంతర ఎన్నికల వంటి పరిణామాలు అనుకున్నదానికంటే ముందే జరిగే అవకాశముంది.

ఇక తెలంగాణలో బిజెపి, టిఆర్ఎస్‌ను కాదని కొండా సురేఖ గెలిస్తే జగన్ సానుభూతి ముందు తెలంగాణవాదం కూడా పలుచన పడే అవకాశముందని అంటున్నారు. ఇప్పటికే సీమాంధ్రలో జగన్ పార్టీ తెలుగుదేశం, కాంగ్రెసులకు ముచ్చెమటలు పెట్టిస్తుంది. ఇప్పుడు కొండా సురేఖ గెలిచిన పక్షంలో జగన్ మున్ముందు తన సత్తాను తెలంగాణలోనూ చాటే అవకాశముంది. ఇది తెరాసకు మింగుడు పడనిదిగా మారుతుందనడంలో సందేహం లేదు. మొత్తం స్థానాలలో జగన్ గెలిస్తే తెరాసతో సహా అన్ని ప్రధాన పార్టీల నుండి ఆయన పార్టీ వైపు భారీగా జంప్‌లు ఉంటాయని అంటున్నారు.

తిరుపతి, పరకాలను మినహాయించి మిగిలిన పదహారు స్థానాలలో వైయస్సార్ కాంగ్రెసు జెండా ఎగిరితే ఇప్పటికిప్పుడు ప్రభుత్వానికి వచ్చిన నష్టమమీ లేదనే అభిప్రాయాలు వెలువడుతున్నాయి. ఈ స్థానాలలో ఎలాగూ జగన్ పార్టీయే గెలుస్తుందని అందరూ ముందునుండి భావిస్తున్న నేపథ్యంలో వచ్చే నష్టమైమీ లేదని అంటున్నారు. రాజీనామాలు చేసిన వారే పోటి చేయడం, దివంగత వైయస్ రాజశేఖర రెడ్డిపై ఉన్న అభిమానం, జగన్ అరెస్టు, విజయమ్మ షర్మిలల సానుభూతి ప్రచారం తదితర కారణాల వల్ల వారు గెలిచారనే అభిప్రాయం వ్యక్తమౌతుంది.

అయితే ప్రధాన పార్టీలను తలదన్ని కొత్త పార్టీ 16 స్థానాలను గెలుచుకోవడం మాత్రం కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలకు గట్టి దెబ్బగానే భావించాల్సి ఉంటుందని అంటున్నారు. టిడిపి మాట పక్కన పెడితే సీమాంధ్ర కాంగ్రెసులో మాత్రం కుదుపు ఉంటుందనే వాదనలు వినిపిస్తున్నాయి. కాంగ్రెసు తరఫున చిరంజీవి వంటి స్టార్ కంపెయినర్, కేంద్రమంత్రులు, ముఖ్యమంత్రి, పిసిసి చీఫ్ బొత్స సత్యనారాయణ ప్రచారం చేశారు. వారు ప్రచారం చేసినప్పటికీ ఫలితం లేదంటే కాంగ్రెసుకు సీమాంధ్రలో మున్ముందు మరింత ఎదురు దెబ్బ తగిలే అవకాశాలు ఉంటాయంటున్నారు.

ఇప్పటికిప్పుడు ప్రభుత్వానికి ఎలాంటి ఇబ్బందులు లేవనుకున్నప్పటీకీ... పూర్తి కాలం కొనసాగే విషయంపై మాత్రం సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఇక 12 స్థానాలకు కాస్త అటు ఇటుగా వచ్చిన పక్షంలో కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలో కొత్త ఉత్సాహం పుట్టుకొస్తుంది. అదే సమయంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ పరిస్థితి అందుకు విరుద్దంగా ఉంటుంది. అటు నుండి కాంగ్రెసు వైపు జంప్‌లు పెరిగినా ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదంటున్నారు. అప్పుడు ఆ పార్టీ భవిష్యత్తే ప్రశ్నార్థకమవుతుందని చెబుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎలాంటి ఢోకా ఉండదు.

జగన్, ఆయన పార్టీ భవిష్యత్తు కోసం ఖచ్చితంగా ఈ ఉప ఎన్నికలలో 16 లేదా అంతకంటే ఎక్కువ స్థానాలు గెలవాల్సి ఉంటుందని అభిప్రాయపడుతున్నారు. ఇక పరకాలలో కొండా సురేఖ గెలిస్తే తెలంగాణ సెంటిమెంటును జగన్ సెంటిమెంట్ అధిగమించినట్లే! అప్పుడు తెలంగాణ కోసం ఉద్భవించిన తెరాస నుండి కూడా జగన్ పార్టీ వైపు వలసలు ఉంటాయి. సీమాంధ్రలో జగన్ పార్టీ గెలుపోటములు ఎలా ఉన్నా పరకాలలో గెలిస్తే మాత్రం ప్రధాన పార్టీలకు ఆందోళన కలిగించే అంశమే.

అంతేకాదు తెలంగాణవాదం లేదని సీమాంధ్ర నేతలు జోరుగా ప్రచారం చేస్తారు. కొండా సురేఖ గెలిస్తే సీమాంధ్రకు చెందిన కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీ నేతలు కూడా సమైక్యవాదం గళమెత్తుతారు. అది తెలంగాణవాదాన్ని బలహీనపర్చే అవకాశముందని అంటున్నారు. 
17 స్థానాల్లో జగన్ వర్గీయుల కారణంగా ఉప ఎన్నికలు జరిగితే.. తిరుపతిలో మాత్రం రాజ్యసభ సభ్యుడు చిరంజీవి రాజీనామా వల్ల ఉప ఎన్నిక వచ్చింది.

ఇంతే కాకుండా చాలా రకాలుగా తిరుపతికి ప్రత్యేక స్థానం ఉంది. ఇక్కడ గెలుపు అందరికీ ప్రతిష్ఠాత్మకంగా మారింది. తన తండ్రి వైయస్‌కు అత్యంత సన్నిహితుడైన భూమన కరుణాకర్ రెడ్డిని గెలిపించుకోవడం జగన్‌కు అత్యంత అవసరంగా మారింది. తిరుపతిలో గెలిస్తే... జగన్‌కు బోనస్‌గా ఒక స్థానం వచ్చినట్లే. ఇక... తిరుపతి గెలుపు కాంగ్రెస్‌కు, ముఖ్యమంత్రి కిరణ్‌కు, ప్రతిపక్ష నేత చంద్రబాబుకు కూడా ప్రతిష్టాత్మకం.