చంద్రబాబుపై తెలంగాణ ఒత్తిడి

చంద్రబాబుపై తెలంగాణ ఒత్తిడి

 తెలంగాణ అంశంపై స్పష్టమైన వైఖరి ప్రకటించాలని  తెలుగుదేశం అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిపై పార్టీ నాయకుల నుంచి ఒత్తిడి పెరుగుతున్నట్లు సమాచారం. ఉప ఎన్నికల ఫలితాలపై, రాష్ట్రపతి ఎన్నికపై చర్చించడానికి చంద్రబాబు అధ్యక్షతన తెలుగుదేశం పార్టీ పోలిట్‌బ్యూరో సమావేశం జరిగింది. తెలంగాణ సమస్యను స్పష్టంగా తేల్చాలని కొందరు నాయకులు చంద్రబాబును అడిగినట్లు సమాచారం.

త్వరలో ఈ అంశంపై పార్టీలో అభిప్రాయ సేకరణ జరుపుతానని చంద్రబాబు చెప్పినట్లు సమాచారం. అయితే, సమావేశంలో  తెలంగాణ అంశం ప్రస్తావనకు రాలేదని తెలుగుదేశం పోలిట్‌బ్యూరో సభ్యులు నామా నాగేశ్వర రావు, యనమల రామకృష్ణుడు, దాడి వీరభద్రరావు చెప్పారు. ఉప ఎన్నికల ఫలితాలపై సమావేశంలో అంతర్మథనం జరిగింది. ఉప ఎన్నికల ఫలితాలపై లోతుగా విశ్లేషించాలని పోలిట్ బ్యూరో సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.

ఉప ఎన్నికల ఫలితాలపై చంద్రబాబు నాయుడు సోమవారం నుంచి సమీక్ష జరుపుతారు. నియోజకవర్గాలవారీగా ఈ సమీక్ష జరుగుతుంది. రోజుకు రెండేసి నియోజకవర్గాల నాయకులతో చంద్రబాబు సమావేశమవుతారు. సమీక్ష జరిపిన తర్వాత లోటుపాట్లను సరిదిద్దుకోవాలనే ఆలోచనలో చంద్రబాబు ఉన్నట్లు చెబుతున్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి అవినీతిపై పెద్ద యెత్తున ప్రచారం చేసినా కట్టడి చేయలేకపోయామనే అభిప్రాయం వ్యక్తమైనట్లు తెలుస్తోంది.

కాంగ్రెసు తప్పిదం వల్లనే వైయస్ జగన్ ఉప ఎన్నికల్లో ఘన విజయం సాధించారనే అభిప్రాయం సమావేశంలో వ్యక్తమైనట్లు చెబుతున్నారు. జగన్ అవినీతిపై ప్రజల్లో చైతన్యం తెచ్చే విధంగా ప్రచారం చేయలేకపోయామనే అభిప్రాయం వ్యక్తమైనట్లు చెబుతున్నారు. పోలిట్‌బ్యూరో సమావేశానికి యనమల రామకృష్ణుడు, కడియం శ్రీహరి, దేవేందర్ గౌడ్, నామా నాగేశ్వర రావు, ఉమా మాధవ రెడ్డి, కాల్వ శ్రీనివాసులు, దాడి వీరభద్ర రావు, పయ్యావుల కేశవ్, ఎర్రబెల్లి దయాకర్ రావు, కెఇ కృష్ణమూర్తి, కల్పన హాజరయ్యారు.