లక్ష్మినారాయణే వైయస్సార్సిపి టార్గెట్

 లక్ష్మినారాయణే వైయస్సార్సిపి టార్గెట్

 తమ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ ఆస్తుల కేసులో సిబిఐ జాయింట్ డైరెక్టర్ (జెడి) లక్ష్మినారాయణను వైయస్సార్ కాంగ్రెసు పార్టీ టార్గెట్ చేసినట్లు కనిపిస్తోంది. ఇప్పటి వరకు కాస్తా మెతగ్గా సిబిఐ తీరును తప్పు పడుతున్న వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు గురువారం తమ దూకుడు పెంచారు. తమ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్‌పై వచ్చిన ఆరోపణలకు వివరణ ఇవ్వడాన్ని పక్కన పెట్టేసి, దర్యాప్తునకు నేతృత్వం వహిస్తున్న లక్ష్మినారాయణను లక్ష్యం చేసుకుని విమర్శలు ఎక్కుపెడుతున్నారు.

లక్ష్మినారాయణ పలు హై ప్రొపైల్ కేసులకు నేతృత్వం వహిస్తున్నారు. కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి అక్రమ మైనింగ్, ఎమ్మార్ ప్రాపర్టీస్ కుంభకోణం, వైయస్ జగన్ ఆస్తులు, సోహ్రబుద్దీన్ ఎన్‌కౌంటర్, ఆజాద్ ఎన్‌కౌంటర్ తదితర కేసుల దర్యాప్తునకు ఆయన నేతృత్వం వహిస్తున్నారు. ఆయన దర్యాప్తు పట్ల ఓ వర్గం అమితమైన విశ్వాసాన్ని వ్యక్తం చేస్తోంది. అయితే, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు ఆయన విశ్వసనీయతనే ప్రశ్నిస్తున్నారు.

జెడి లక్ష్మినారాయణ ఏయే నెంబర్లకు కాల్స్ చేశారనే వివరాలను వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు విడుదల చేశారు. తమ వ్యతిరేకులతో జత కట్టి లక్ష్మినారాయణ దర్యాప్తు వివరాలను లీక్ చేస్తున్నారని వారు ఆరోపిస్తూ అసెంబ్లీ వద్ద ధర్నాకు కూడా దిగారు. తమ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్‌ను భౌతికంగా అంతం చేయడానికి కుట్ర జరుగుతుందనే అనుమానాలు కలుగుతున్నాయని వారన్నారు.

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకుల ఆరోపణలను తిప్పకొట్టడానికి కొన్ని మీడియా సంస్థల ప్రతినిధులు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేతలపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అయితే, వారి మీడియా సమావేశం తీరును చూసిన వైయస్సార్ కాంగ్రెసు నాయకులు వివరణ ఇచ్చుకున్నారు. అయితే, జెడి లక్ష్మినారాయణపై చేసిన ఆరోపణల విషయంలో మాత్రం వెనక్కి తగ్గలేదు.

వాసిరెడ్డి చంద్రబాల అనే మహిళ జెడి లక్ష్మినారాయణతో, ఆంధ్రజ్యోతి ఎండి రాధాకృష్ణతో, గ్రేహౌండ్స్ ఐజితో మాట్లాడడంలోని రహస్యమేమిటని వారు అడుగుతున్నారు. చంద్రబాల ఎవరో బయటకు రావాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ వ్యవహారాలన్నీ చూస్తుంటే తమ వ్యతిరేకులతో కలిసి లక్ష్మినారాయణ పనిచేస్తున్నారనే అనుమానాలను వ్యక్తం చేశారు.

కాగా, ఇంతలోనే సాక్షి మీడియాలో మరో వార్త కూడా వచ్చింది. ఎల్లో మీడియా ప్రతినిధులతో  జెడి లక్ష్మినారాయణమాట్లాడారని, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకుల ఆరోపణల తర్వాత ఆయన వారితో మంతనాలు జరిపారని, ఆ తర్వాతనే మీడియా ప్రతినిధులు మీడియా సమావేశం ఏర్పాటు చేసి వైయస్సార్ కాంగ్రెసు నాయకులపై విమర్శలు చేశారని సాక్షి మీడియా కథనం వ్యాఖ్యానించింది.