జగన్ నిర్దోషి, బయటకొస్తారు

 జగన్ నిర్దోషి, బయటకొస్తారు

 వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి నిర్దోషిగా బయటపడతారని జగతి పబ్లికేషన్స్ వైస్ చైర్మన్, ఆడిటర్ విజయ సాయి రెడ్డి సోమవారం అన్నారు. ఆయన చిత్తూరు జిల్లా తిరుపతి గ్రామీణ మండలం తుమ్మలగుంటలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత చెవిరెడ్డి భాస్కర రెడ్డి నివాసంలో ఉదయం విలేకరులతో మాట్లాడారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. అధికార కాంగ్రెసు ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీలు ఉద్దేశ్య పూర్వకంగా జగన్‌కు అక్రమాస్తులు ఉన్నాయని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సిబిఐ) కోర్టుకు ఫిర్యాదు చేశాయని ఆరోపించారు. సిబిఐ వద్ద ఎటువంటి ఆధారాలు లేవని చెప్పారు. జగన్ తప్పకుండా నిర్దోషిగా బయటకు వస్తారని ఆకాంక్షించారు. జగన్ ఎలాంటి అక్రమాలకు పాల్పడలేదని ఆయన తెలిపారు.

అంతకుముందు ఆయన ఉదయం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల వచ్చిన విజయ సాయి రెడ్డి శ్రీవారి దర్శనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జగన్ అన్ని కేసుల నుండి త్వరలో బయటపడతారని చెప్పారు. నార్కో టెస్టులు చట్ట విరుద్ధమని, అమానవీయ పరీక్షగా సుప్రీం కోర్టు నిర్ధారించిందని సాయిరెడ్డి చెప్పారు.

ఆ పరీక్షలకు సిబిఐ కోర్టు అనుమతిస్తుందని తాను భావించడం లేదన్నారు. కాగా సిబిఐ విచారణ జరుపుతున్న జగన్ అక్రమాస్తుల కేసులో  విజయ సాయి రెడ్డి ఎ-2 నిందితుడిగా ఉన్న విషయం తెలిసిందే. జగన్ ఆస్తుల కేసులో సిబిఐ ఆయనను అరెస్టు చేసింది. ఆ తర్వాత ఆయన బెయిల్ పైన విడుదలయ్యారు.