2014లో జగన్ ముఖ్యమంత్రి అని చెప్పారు

2014లో జగన్ ముఖ్యమంత్రి అని చెప్పారు

 తన భర్త, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి అక్రమాలకు పాల్పడినట్లు సిబిఐ నిరూపించలేక పోతోందని జగన్ సతీమణి వైయస్ భారతి రెడ్డి ఓ జాతీయ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో శనివారం అన్నారు. ఉప ఎన్నికల ఫలితాలు విడుదలైన తర్వాత రోజు ఆమె ఇంటర్వ్యూ ఇచ్చారు. జగన్ ఎలాంటి అవినీతికి పాల్పడలేదన్నారు. ఉద్దేశ్య పూర్వకంగా కావాలనే కేసుల్లోకి లాగాలని ప్రయత్నిస్తున్నారన్నారు.

సాక్షి ముఖ విలువను పట్టుకొని జగన్ పైన కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. సాక్షి పత్రిక అతి తక్కువ సమయంలో దేశంలోనే టాప్-8 పేపర్‌గా ఎదిగిందన్నారు. పత్రిక ఇంత జనాధరణ చూరగొనడానికి క్వాలిటీని, పత్రికా విలువలు పాటించడమే కారణమన్నారు. జగన్‌కు బెయిల్ ఇచ్చి బయటకు వస్తే సాక్ష్యులను ప్రభావితం చేస్తారనే సిబిఐ వాదనన ఆమె తోసిపుచ్చారు. గత పదినెలలుగా ఈ కేసు నడుస్తోందని, అప్పుడు జగన్ బయటే ఉన్నారని, ఇన్ని రోజులుగా ఎవరినీ ప్రభావితం చేయకుండా ఇప్పుడెలా చేస్తారన్నారు.

జగన్ బయట ఉండగా ఎవరినైనా ప్రభావితం చేశారా చూపించాలని సవాల్ చేశారు. విచారణలో సిబిఐకి సహకరించలేదనేది పూర్తిగా అవాస్తవమన్నారు. సిబిఐ అబద్దం చెబుతోందన్నారు. తాను విచారణకు సహకరించానో లేదో తెలియాలంటే వీడియోను బయట చూపించాలని జగన్ కోర్టును కోరారని, కానీ సిబిఐ మాత్రం అందుకు నిరాకరించిందన్నారు. విచారణకు జగన్ సహకరించకపోతే వీడియోలో తెలుస్తుంది కదా అన్నారు.

ఉప ఎన్నికలలో తాము ఘన విజయం సాధించామని, దీంతో ప్రజలు తమ వెంటే ఉన్నారని అందరికీ అర్థమైందన్నారు. జగన్ జైలు నుండి బయటకు తీసుకు రావడమే తమ ప్రధాన ఉద్దేశ్యమన్నారు. జగన్ త్వరలో బయటకు వస్తారని తాము గట్టిగా విశ్వసిస్తున్నామని, ఒకవేళ బెయిల్ రాకపోతే తాము న్యాయం కోసం ప్రజల వద్దకు వెళతామని చెప్పారు. వచ్చే వారం వైయస్ విజయమ్మ ఢిల్లీ వెళుతున్నారని, అక్కడ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ సహా పలువురు ముఖ్య నేతలను కలవనున్నారని చెప్పారు.

కేసు విచారణ వేగవంతంగా, పారదర్శకంగా జరగాలంటే సుప్రీం కోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. జగన్ పైన కేసులు, అరెస్టు అంతా కాంగ్రెసు పార్టీ రాజకీయ కుట్ర అని ఆరోపించారు. ఉప ఎన్నికలలో కాంగ్రెసును ఓడించడం ద్వారా ప్రజలు కూడా అదే తీర్పు చెప్పారన్నారు. జగన్ కూడా ఆయన తండ్రి దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి వలె ప్రజలలో ఆదరణ కలిగిన నేత అన్నారు. జగన్ ముఖ్యమంత్రి అవుతాడా అన్న ప్రశ్నకు భారతి సమాధానమిస్తూ... తాను అనుకున్నది సాధించే వరకు విశ్రాంతి తీసుకునే రకం కాదన్నారు.

జగన్ సాక్షి కోసం బాగా కష్టపడ్డాడని, అలాగే దివంగత వైయస్‌లాగే ప్రజల కోసం ఆలోచించే వ్యక్తి అన్నారు. దేవుడి ఆశీస్సులతో 2014లో జగన్ ముఖ్యమంత్రి అవుతారని అన్నారు. భారతదేశం గర్వించదగిన ముఖ్యమంత్రులలో జగన్ ఉంటారన్నారు. తమతో ఇప్పటి వరకు 20కి పైగా ఎమ్మెల్యేలు ఉన్నారని, మరికొందరు టచ్‌లో ఉన్నారని భారతి చెప్పారు. అయితే ఎమ్మెల్యేల మద్దతు ఉన్నప్పటికీ తన సొంత అజెండా కోసం జగన్ అవిశ్వాస తీర్మానం పెట్టాలనుకోవడం లేదన్నారు.

జగన్ మనసు కక్ష తీర్చుకునే రకం కాదన్నారు. వైయస్ఆర్ ద్వారా ఎదిగిన వారు ఆయనను, ఆయన తనయుడు వైయస్ జగన్‌ను లక్ష్యంగా చేసుకోవడం చాలా బాధాకరమని భారతి ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తమ ఇంట్లో 70 గదులు ఉన్నాయని చెబుతున్నారని.. ఇది అవాస్తవమన్నారు. లోటస్ పాండులోని తమ ఇంట్లో కేవలం నాలుగు బెడ్ రూంలు మాత్రమే ఉన్నాయన్నారు. వైయసమ మృతి తర్వాత జగన్ ఎప్పుడూ ముఖ్యమంత్రి పదవి కోసం ఆశపడలేదన్నారు.

వైయస్ మృతితో తమ కుటుంబం 20 రోజులకు పైగా షాక్‌లో ఉందని, ఆ తర్వాతే తమకు జగన్‌ను ముఖ్యమంత్రిగా చేయాలని సంతకాలు చేయించినట్లు తెలిసిందన్నారు. వైయస్ మృతిని తట్టుకోలేక చనిపోయిన వారిని ఓదార్చడం తన బాధ్యతగా జగన్ భావించారన్నారు. కానీ ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ ఓదార్పు యాత్రకు అనుమతివ్వలేదన్నారు. ఆరు నెలల అనంతరం జగన్ ఓదార్పు చేయాలని నిర్ణయించుకున్నారని చెప్పారు. తాజా ఉప ఎన్నికలలో ప్రజలు తమ ఓటు ద్వారా జగన్ ముఖ్యమంత్రి అవుతారని చెప్పారన్నారు.