బెయిల్ డీల్‌పై గాలి జనార్దన్ స్పందన

 బెయిల్ డీల్‌పై గాలి జనార్దన్ స్పందన

 న్యాయమూర్తికి ముడుపులు ఇచ్చి బెయిల్ పొందడానికి జరిగిన డీల్ విషయంలో తనకేమీ సంబంధం లేదని ఓబుళాపురం మైనింగ్ కంపెనీ (ఒఎంసి) అక్రమ మైనింగ్ కేసులో నిందితుడు, కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి అన్నారు. ఆ వ్యవహారంలో తాను ఏ పాపమూ ఎరుగనని, దాని గురించి తనకేమీ తెలియదని ఆయన అన్నారు. సిబిఐ అధికారులు బెంగళూరు జైల్లో ఉన్న జనార్దనరెడ్డి వద్దకు వెళ్లి గత రెండు రోజులుగా ఈ కుంభకోణం గురించి విచారిస్తున్నారు. 

తాను జైల్లో ఉన్నానని, బయట జరిగే సంఘటనలతో తనకు ఎలాంటి సంబంధం లేదని గాలి జనార్దన్ రెడ్డి వారికి పదే పదే స్పష్టంచేసినట్లు సమాచారం. దీంతో వారు ఆ మేరకు వాంగ్మూలం రికార్డు చేసినట్లు తెలిసింది. సిబిఐ కోర్టు న్యాయమూర్తి పట్టాభిరామారావుకు ఏ మేరకు ముడుపులు ముట్టజెప్పారు? ఇందుకు సంబంధించిన మొత్తం ఎక్కడి నుంచి వచ్చింది? అనే అంశాలపై సీబీఐ అధికారులు ప్రశ్నిస్తే గాలి వైపునుంచి అన్నింటికీ 'తెలియదనే' సమాధానమే వచ్చినట్లు సమాచారం. 

మరోవైపు జనార్దనరెడ్డిని ఆయన సోదరుడు, ఎమ్మెల్యే గాలి సోమశేఖర్ రెడ్డి సోమవారం పరామర్శించారు. తనకు న్యాయవ్యవస్థపై అపార నమ్మకం ఉందని, జనార్దనరెడ్డి తనతో అన్నారని ఆయన మీడియాకు తెలిపారు. సిబిఐ అధికారులు కావాలంటే తనను ఎప్పుడైనా, ఎక్కడైనా విచారించుకోవచ్చునని తెలిపారు. ఎమ్మెల్యే సురేష్ బాబు కూడా తన సొంత నియోజకవర్గం కంప్లిలోనే ఉ న్నారని, ఆయనను కూడా కావాలంటే ప్రశ్నించవచ్చునన్నారు. రాజకీయంగా తమకు గిట్టనివారిపై కాంగ్రెస్ సిబిఐ ప్రయోగిస్తోందని మాజీ మంత్రి, గాలి స్నేహితుడు శ్రీరాములు సోమవారం ఆరోపించారు.

పట్టాభి రామారావు అనే న్యాయమూర్తికి ముడుపులు ఇచ్చి గాలి జనార్దన్ రెడ్డి ఒఎంసి కేసులో బెయిల్ పొందినట్లు సిబిఐ గుర్తించి, ఆ గుట్టును విప్పింది. దీంతో పట్టాభి రామారావు సస్పెన్షన్‌కు గురయ్యారు. దాదాపు 60 కోట్ల రూపాయల డీల్ జరిగినట్లు సిబిఐ గుర్తించినట్లు వార్తలు వచ్చాయి.