నగల వ్యాపారి చుట్టూ ఉచ్చు?

 నగల వ్యాపారి చుట్టూ ఉచ్చు?

 వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ ఆస్తుల కేసులో ఓ నగల వ్యాపారి చుట్టూ ఉచ్చు బిగిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ముసద్దిలాల్ భగవత్ స్వరూప్ (ఎంబియస్) జ్యువెల్లరీస్ యజమాని సుఖేష్ గుప్తాను సిబిఐ అధికారులు మంగళవారం ప్రశ్నించినట్లు ఓ టీవీ చానెల్‌లో వార్త ప్రసారమైంది. మహా టీవీ తెలుగు టీవీ చానెల్ ఆ వార్తాకథనాన్ని మంగళవారం సాయంత్రం ప్రసారం చేసింది.

 

ఆ టీవీ చానెల్ కథనం ప్రకారం - వైయస్ జగన్మోహన్ రెడ్డికి సంబంధించి సుఖేష్ గుప్తా హవాలా వ్యవహారంలో కీలక పాత్ర పోషించినట్లు సిబిఐ అనుమానిస్తోంది. జగన్ నల్లధనాన్ని వైట్‌గా మార్చడంలో ఆయన పాత్ర ఉందని సిబిఐ భావిస్తోంది. దీంతో సుఖేష్ గుప్తాను మంగళవారం ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం వరకు ప్రశ్నించింది. సుఖేష్ గుప్తాను సిబిఐ ప్రశ్నిస్తున్న విషయం మంగళవారం మధ్యాహ్నం బయటకు పొక్కింది.

సుఖేష్ గుప్తా బంగారం రూపంలో హవాలా డబ్బును తరలించారని అనుమానిస్తున్నారు. సుఖేష్ గుప్తాకు హైదరాబాదులోనే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా నగల షోరూంలు ఉన్నాయి. ఆయనకు పలువురు ప్రముఖులతో సంబంధాలున్నట్లు చెబుతారు. జననీ ఇన్‌ఫ్రా డైరెక్టర్, కాకినాడ కాంగ్రెసు శానససభ్యుడు ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి కూడా సిబిఐ అధికారులు మంగళవారం ప్రశ్నించారు. సాయంత్రం ఐదు గంటలకు వైయస్ జగన్‌ను చంచల్‌గుడా జైలుకు తరలించిన తర్వాత కూడా ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డిని సిబిఐ అధికారులు ప్రశ్నించారు.

కాగా, సిబిఐ అధికారులు వైయస్ జగన్‌ను మంగళవారం మూడో రోజు ప్రశ్నించారు. ఆయనను సాయంత్రం ఐదు గంటల వరకు ప్రశ్నించారు. ఆయనతో పాటు సాక్షి ఎడిటోరియల్ డైరెక్టర్ సజ్జల రామకృష్ణా రెడ్డిని కూడా సిబిఐ అధికారులు ప్రశ్నించారు.