సూరి పేరు వాడుకుని బెదిరంచా: మంగలి కృష్ణ

సూరి పేరు వాడుకుని బెదిరంచా: మంగలి కృష్ణ

జలయజ్ఞం కాంట్రాక్టర్లనుంచి డబ్బులు వసూళ్లు చేశామని, సెటిల్‌మెంట్లు చేసి కోట్ల రూపాయల ఆస్తులు వెనకేసుకున్నామని, కానీ, భానుకిరణ్‌కు ఆయుధాలు సరఫరా చేయలేదని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు  వైయస్ జగన్  అనుచరుడు పులివెందుల కృష్ణ సిఐడి అధికారులకు వివరించినట్లు సమాచారం. హంద్రీనీవా ప్రాజెక్టు పనుల్లో కాంట్రాక్టర్లను బెదిరించి కోట్ల రూపాయలు అక్రమంగా వసూళ్లు చేసిన కేసులో అరెస్టైన పులివెందుల కృష్ణను సీఐడీ అధికారులు కస్టడీకి తీసుకొని వారం రోజుల పాటు విచారించారు.

తాను యువనేత పేరును, భానుకిరణ్  మద్దెలచెరువు సూరి పేరును వాడుకొని పలువురిని బెదిరించానని అంగీకరించినట్లు సమాచారం. కాంట్రాక్టర్ల నుంచి కోట్ల రూపాయలు వసూలు చేసినట్లు సిఐడి విచారణలో వెల్లడించినట్లు తెలిసింది. తమ ముఠా సుమారు రూ.80కోట్లు జలయజ్ఞం కాంట్రాక్టర్ల నుంచే వసూలు చేసినట్లు అంగీకరించాడని సమాచారం. సుమారు 25మంది కాంట్రాక్టర్లు భాను గ్యాంగ్‌కు కోట్లరూపాయలు చెల్లించినట్లు సిఐడి అధికారుల వద్ద సమాచారముంది. దీనికి ఆయుధాల సమాచారం మినహా అంతా దాదాపు సరిపోయినట్లు తెలిసింది. 

ధర్మవరం మాజీ ఎమ్మెల్యే సూరీడు అబిడ్స్‌లో రెండు రివాల్వర్లు తనకు కొనిచ్చినట్లు భాను నేరాంగీకార పత్రంలో వెల్లడించినట్లు సిఐడి తెలిపింది. దీన్ని నిజమేనని కృష్ణ చెప్పినట్లు సమాచారం. అయితే ఆయుధాలు కృష్ణ ఇచ్చాడని భానుకిరణ్ మరోసారి సిఐడి అధికారులకు చెప్పడంతో కృష్ణ కావాలని దాస్తున్నాడని దర్యాప్తు అధికారులు అనుమానిస్తున్నారు. అయితే తన ప్రాణాలకు ఆయుధ మాఫియా నుంచి ముప్పుంటుందని భావించే అతను వెల్లడించడం లేదని, అయినప్పటికీ ఎలాగైనా ఆయుధాల డొంకను కదిలిస్తామని చెప్పారు. 

కాగా, వారం రోజుల సిఐడి కస్టడీ ముగియడంతో శుక్రవారం దంతలూరి కృష్ణను అధికారులు నాంపల్లి కోర్టులో ప్రవేశపెట్టారు. దీంతో న్యాయమూర్తి నిందితుడికి ఈ నెల 6వరకూ జ్యూడీషియల్ కస్టడీ విధించారు. అధికారులు కృష్ణను చర్లపల్లి జైలుకు తరలించారు. సూరి హత్యకేసులో అరెస్టైన భానుకిరణ్‌కు ఈ నెల 13వరకూ న్యాయస్థానం రిమాండ్ విధించింది.