చిరు ‘గాడ్ ఫాదర్' ఎందుకు చేయలేదు?

చిరు ‘గాడ్ ఫాదర్' ఎందుకు చేయలేదు?

చిరంజీవి 150వ సినిమా ఎప్పుడు తీస్తారా? అని ఆసక్తిగా ఎదురు చూస్తున్న అభిమానులకు ఆ మధ్య ఓ చల్లని కబురు వినిపించింది. చిరు నటించబోయే సినిమాకి ‘ది గాడ్ పాదర్' అనే టైటిల్ ని పెట్టాలనుకుంటున్నట్టు వార్తలు వినిపించాయి. అలాగే ఈ టైటిల్ కి ట్యాగ్ లైన్ గా ‘ప్రజా నాయకుడు' అని.... ప్రజల నాయకుడిగా ఈ సినిమాలో చిరు కనిపిస్తాడనే ఊహాగానాలు కూడా వినిపించాయి.

గాడ్ ఫాదర్ లో చిరంజీవిని గ్రేట్ కమర్షియల్, పొటెన్సియల్ పర్సన్ గా చూడొచ్చొని, చిరు చేయబోయే 150వ సినిమా అతని రాజకీయ జీవితానికి కూడా ఉపయోగపడే విధంగా ఉంటుందని అప్పట్లో చర్చించుకున్నారు. కానీ ఆ సినిమా తెరకెక్క కుండానే రద్దయి పోయింది.

చిరంజీవితో మగమహారాజు, ఖైదీ నెం. 786, గ్యాంగ్ లీడర్ తదితర చిత్రాలు చేసిన దర్శకుడు విజయబాపినీడు.... రామ్ గోపాల్ వర్మ రూపొందించిన ‘సర్కార్' చిత్రం చూసి ఇంప్రెస్ అయి చిరంజీవితో ‘గాడ్ ఫాదర్' సినిమా తీయాలని 2005లో డిసైడ్ అయ్యారు. అయితే అప్పట్లో చిరంజీవి యమ బీజిగా ఉండటం, డేట్స్ కేటాయించక పోవడంతో ఆ ప్రాజెక్టు ఆచరణకు నోచుకోలేదు.

తాజాగా చిరంజీవి 150 వ చిత్రానికి వివి వినాయక్ దర్శకత్వం వహిస్తారని తెలుస్తోంది. సినీ వర్గాల నుంచి వినిపిస్తున్న వార్తల ప్రకారం ఈ చిత్రానికి ‘నాయకుడే సేవకుడు' అనే టైటిల్ ఖరారు చేసినట్లు తెలుస్తోంది. దీన్ని ఇప్పటికే ఫిల్మ్ చాంబర్లో రిజిస్టర్ కూడా చేయించారు.

చిరంజీవి రాజకీయ భవిష్యత్‌కు ప్లస్సయ్యేలా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈచిత్రాన్ని స్వయంగా చిరంజీవి తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ నిర్మించనున్నారు. ఎంటర్‌టైన్మెంట్ విత్ పాలిటిక్స్ జోడించి సందేశాత్మకంగా ఈ చిత్రానికి సంబంధించిన కథను తయారు చేస్తున్నారు. 150వ చిత్రం...పైగా  చిరంజీవి సినీ జీవితంలో చివరి చిత్రంగా దీన్ని రూపొందిస్తుండటంతో చాలా ప్రతిష్టాత్మకంగా ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే వందల కొద్ది కథలను పరిశీలించారు...ఇంకా పరిశీలిస్తున్నారు. త్వరలోనే కథ ఖరారు కానుంది. దీనిపై అధికారిక ప్రకటన వెలువడే రోజు కూడా ఎంతో దూరంలో లేదు.