జగన్ కు ముఖ్యమంత్రి అయ్యే అర్హత లేదు

జగన్ కు ముఖ్యమంత్రి అయ్యే అర్హత లేదు

 వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి తనకు ఉన్నట్లుగా ముఖ్యమంత్రి అయ్యే అర్హత లేదని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం అన్నారు. ఆయన పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రూపాయికి కిలో బియ్యం పేరుతో దోచుకుంటున్నారని మండిపడ్డారు.

వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రజల సొమ్ముతో హైదరాబాదు, బెంగళూరులలో భవంతులు కట్టుకుంటున్నారని విమర్శించారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే రైతులకు ఉచిత విద్యుత్ ఇస్తుందన్నారు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ముడియం శ్రీనివాస్‌ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. పేదరికం లేని సమాజం చూడటమే తన జీవిత ధ్యేయమని అన్నారు. పోలవరం నిర్వాసితులకు పూర్తి న్యాయం జరిగే వరకు తన పోరాటం కొనసాగుతుందన్నారు.

వైయస్ జగన్మోహన్ రెడ్డికి చెందిన బినామీ ఆస్తుల పైన సిబిఐ విచారణ జరపాలని తెలుగుదేశం పార్టీ నేత దాడి వీరభద్ర రావు హైదరాబాదులో డిమాండ్ చేశారు. దోచుకున్నది దాచుకోవడానికే జగన్ ముఖ్యమంత్రి పీఠంపై కన్నేశారన్నారు. జగన్ పార్లమెంటు సభ్యుడిగా ఏనాడైనా ప్రజా సమస్యలను పార్లమెంటులో ప్రస్తావించారా అని ప్రశ్నించారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి స్థానంలో ముఖ్యమంత్రి కావడమే జగన్ లక్ష్యమన్నారు.

జగన్ ముఖ్యమంత్రి కావడం కోసం, ఆయన ఆస్తులు కాపాడుకోవడం కోసం ప్రజలు ఓట్లు వేయాలా అని ప్రశ్నించారు. జగన్‌కు రాజకీయాలలో ఉన్న అనుభవమేదైనా ఉందా అంటే కేవలం తన తండ్రి ముఖ్యమంత్రిగా పని చేయడమే అన్నారు. అంతకు మించిన అర్హత జగన్‌కు ఏమీ లేదన్నారు. జగన్ ప్రజల కోసం ఏమైనా త్యాగాలు చేశారా అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కాకమ్మ కథలు చెప్పకుండా గనుల కేటాయింపులు రద్దు చేయాలన్నారు.