జైలుకెళ్లినా నవ్వుతున్నాడు: చంద్రబాబు

జైలుకెళ్లినా నవ్వుతున్నాడు:  చంద్రబాబు

జైలుకెళ్లినా ఏదో ఘన కార్యం చేసినట్లు నవ్వడం వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికే చెల్లిందని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె. నారాయణతో కలిసి ఆయన శనివారం తిరుపతిలో రోడ్‌షో నిర్వహించారు. కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డిపై, జగన్‌పై ఆయన తీవ్రంగా మండిపడ్డారు. నేరాలు చేసి జగన్ జైలుకు వెళ్తే వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మ మొసలి కన్నీరు కారుస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు.

శ్రీవారికి 45 కోట్ల రూపాయలు విలువ చేసే కిరీటాన్ని ఇచ్చినా గాలి జనార్దన్ రెడ్డిని శ్రీవారు క్షమించలేదని చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. గాలి చర్యలను శ్రీవారు హర్షించలేదని ఆయన అన్నారు. తప్పు చేసిన గాలిని శ్రీవారు జైలుకు పంపారని ఈ సందర్భంగా బాబు గుర్తు చేశారు. జైలుకు వెళ్లే నేతలకు ఓటు వేయవద్దని చంద్రబాబు నాయుడు శనివారం నాడు తిరుపతి ఓటర్లకు పిలుపు ఇచ్చారు. జైలుకెళ్లినవారికి ఓటేస్తే రాష్ట్రం అధోగతి పావుతుందని ఆయన అన్నారు.


బ్లాక్‌లో టిక్కెట్లు అమ్ముకునేవారికి ఓట్లు వేయవద్దని కూడా ఆయన అన్నారు. కాంగ్రెస్‌పైనా, తిరుపతినుంచి గతంలో ఎన్నికైన చిరంజీవి పైనా, వైయస్ విజయలక్ష్మిపైనా విమర్శలు చేశారు. రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ కుక్కలు చింపిన విస్తరిలా మార్చేసిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. చిరంజీవి తిరుపతినుంచి ఎన్నికైన తర్వాత ఈ ప్రాంతానికి ఏం చేశారని ఆయన ప్రశ్నించారు. అలాగే విజయమ్మ మొసలి కన్నీరు కారుస్తున్నారని, ఆమె మొసలి కన్నీళ్లు చూసి ఎవ్వరూ సానుభూతి చూపరని ఆయన అన్నారు.

ప్రజలు విజయమ్మపై సానుభూతి చూపితే ప్రజలపై మరొకరు సానుభూతి చూపాల్సి వస్తుందని ఆయన అన్నారు. పెట్రోలు, నిత్యావసర సరుకులు, విద్యుత్ చార్జీలు పెంచిన కాంగ్రెసు నేతలు దొంగల మాదిరిగా ఓట్టు అడిగేందుకు వస్తున్నారని ఆయన అన్నారు. తెలుగుగంగ నుంచి మరో పైప్‌లైన్ వేసి ఆ నీటితో తిరుపతి ప్రజలకు మంచినీరు అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు.

తిరుపతిని హైదరాబాదు తరహాలో అభివృద్ధి చేస్తామని ఆయన చెప్పారు. కాంగ్రెసు, వైయస్సార్ కాంగ్రెసు దొంగల పార్టీలని ఆయన అన్నారు. చిరంజీవి మూడేళ్లకే తిరుపతి ప్రజలకు నామం పెట్టారని సిపిఐ నేత నారాయణ వ్యాఖ్యానించారు.