జగన్ పార్టీ అభ్యర్థిపై అత్యుత్సాహం

జగన్ పార్టీ అభ్యర్థిపై  అత్యుత్సాహం

అనంతపురం జిల్లా రాయదుర్గం వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అభ్యర్థి కాపు రామచంద్రా రెడ్డిపై రెండు టీవీ చానెళ్లు అత్యుత్సాహం ప్రదర్శించాయి. ఆయనను గాలి జనార్దన్ రెడ్డికి చెందిన ఒఎంసి కేసులో సిబిఐ అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తోందని, దాంతో ఆయన ప్రచారంలో కనిపించడం లేదంటూ వార్తలు ఇచ్చాయి. దీంతో కాపు రామచంద్రా రెడ్డి ఆ రెండు చానెళ్లపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. తాము చేసిన తప్పును గ్రహించిన టీవీ చానెళ్లు వెంటనే గుట్టు చప్పుడు కాకుండా ఆ వార్తను వెనక్కి తీసుకున్నాయి. 

కాగా, కాపు రామచంద్రా రెడ్డి గాలి జనార్దన్ రెడ్డికి చెందిన ఓబుళాపురం మైనింగ్ కంపెనీ (ఒఎంసి) డైరెక్టర్‌గా ఉన్నారు. రాయదుర్గం నుంచి 2009 ఎన్నికల్లో కాంగ్రెసు పార్టీ నుంచి కాపు రామచంద్రా రెడ్డి పోటీ చేసి విజయం సాధించారు. ఆ తర్వాత వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి వెంట నడిచారు. ఆయనపై అనర్హత వేటు పడడంతో రాయదుర్గం అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక వచ్చింది.

ఉప ఎన్నికల్లో పోటీ చేయడానికి కాపు రామచంద్రా రెడ్డి నిరాకరించినట్లు మొదట వార్తలు వచ్చాయి. అయితే, వైయస్ జగన్ నచ్చజెప్పడంతో ఆయన పోటీకి దిగినట్లు చెబుతున్నారు. రాయదుర్గంలో ఆయన చురుగ్గా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటూ వస్తున్నారు. తననెవరూ ప్రచారానికి దూరం చేయలేరని కాపు రామచంద్రా రెడ్డి అన్నారు. కావాలనే తనపై బురద చల్లే కార్యక్రమాన్ని పెట్టుకున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. 

తాను బళ్లారిలో చికిత్స చేయించుకుంటున్నట్లు కాపు రామచంద్రా రెడ్డి చెప్పారు. ఒక్క రోజు ప్రచారానికి దూరంగా ఉంటే ఇంత విషప్రచారం చేస్తారా అంటూ ఆయన విరుచుకు పడ్డారు తమ పార్టీ అధినేత జగన్‌ని దెబ్బ తీయడానికి మీడియా విషం చిమ్ముతోందని చెప్పడానికి ఇదే నిదర్శనమని ఆయన అన్నారు. తనను సిబిఐ అదుపులోకి తీసుకుందనే ప్రచారంలో నిజం లేదని, అదంతా ఎల్లో మీడియా వెర్రి వేషాలని ఆయన వ్యాఖ్యానించారు.