మోహన్‌బాబు కొడుకు వర్సెస్ ఎంఎస్ఆర్ సన్

మోహన్‌బాబు కొడుకు వర్సెస్ ఎంఎస్ఆర్ సన్

టాలీవుడ్ టాప్ కమెడియన్లలో ఒకరైన ఎం.ఎస్ నారాయణ తనయుడు విక్రమ్ హీరోగా చేసిన ప్రయత్నాలు విఫలం కావడంతో త్వరలో విలన్ గా అవతారం ఎత్తబోతున్నాడు. మంచు విష్ణు హీరోగా రూపొందుతోన్న ‘ దేనికైనా రెడీ' సినిమాతో విలన్ గా తెలుగు తెరకు పరిచయం కాబోతున్నాడు.

‘దేనికైనా రెడీ ' చిత్రంలో మంచు విష్ణు హీరోగా నటిస్తుండగా, హన్సిక కథానాయికగా నటిస్తున్నారు. ఈ చిత్ర చిత్రీకరణ ప్రస్తుతం చివరి దశలో ఉంది, ఈ చిత్రాన్ని ఆగష్టులో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ బ్యానర్ సమర్పణలో 24 ఫ్రేమ్స్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ ఫై మంచు విష్ణు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న ఈ చిత్రానికి జి. నాగేశ్వర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. కోన వెంకట్ కథను అందిస్తున్న ఈ చిత్రాన్ని యాక్షన్ అండ్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా నాగేశ్వర రెడ్డి తెరకెక్కించనున్నాడు.

విక్రమ్ గతంలో ‘కొడుకు', ‘భజంత్రీలు' చిత్రాలో హీరోగా నటించిన విషయం తెలిసిందే. అయితే ఆ చిత్రాలు ప్రేక్షకుల ఆదరణ పొందక పోవడంతో విక్రమ్ కు వెండి తెరపై లైఫ్ లేకుండా పోయింది. మరి హీరోగా రాణించలేక పోయిన విక్రమ్ విలన్‌గా ఏ మేరకు రాణిస్తాడో చూడాలి.

ఎందుకనో కమెడీయన్ల కొడుకులెవరూ తెలుగు తెరపై రాణించడం లేదు. బ్రహ్మానందం తనయుడి దగ్గర నుంచి కామెడియన్ కమ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ తనికెళ్ల భరణి వరకు ఎవరికీ తెలుగు తెరపై లైఫ్ లేకుండా పోయింది. హీరోగా అయితే రాణించలేననే సత్యం గ్రహించిన విక్రమ్ తనది విలన్ ఫేస్ కట్ అని ఇన్నాళ్లకు తెలుసుకున్నట్లున్నాడు.