అది లగడపాటి వ్యక్తిగతం: బొత్స

అది లగడపాటి వ్యక్తిగతం: బొత్స

ఉప ఎన్నికల్లో మెజారిటీ స్థానాలు వైయస్ జగన్ నాయకత్వంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గెలుచుకుంటుందనేది తమ పార్టీ  పార్లమెంటు సభ్యుడు లడపాటి రాజగోపాల్   వ్యక్తిగత అభిప్రాయమని పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ అన్నారు. లగడపాటి రాజగోపాల్ అభిప్రాయంతో తమ పార్టీకి సంబంధం లేదని ఆయన మంగళవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. ఉప ఎన్నికల్లో ఫలితాలు తమ పార్టీకి ఆశాజనకంగా ఉంటాయని ఆయన అన్నారు. పార్టీ పనితీరులో ఏమైన లోపాలుంటే సరిదిద్దుకుంటామని ఆయన చెప్పారు.

ఉప ఎన్నికల్లో కాంగ్రెసు 12 - 18 సీట్లు గెలుస్తుందని మాజీ మంత్రి పి. శంకర రావు ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెసు పార్టీకే మెజారిటీ సీట్లు దక్కుతాయని ఆయన విడిగా మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. ఈ ఉప ఎన్నికల ఫలితాలతో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి, పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణకు ప్రమోషన్ వస్తుందని ఆయన అన్నారు. 2014 వరకు కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటారని ఆయన చెప్పారు.

తెలంగాణ ఇస్తే రెండు రాష్ట్రాల్లో కూడా తమ కాంగ్రెసు పార్టీయే అధికారంలో ఉంటుందని ఆయన అన్నారు. తెలంగాణ ఇచ్చేది కాంగ్రెసు పార్టీ అని, తెలంగా్ణ అమర వీరులని ఆయన అన్నారు. వచ్చే ఎన్నికల్లో కూడా తమ కాంగ్రెసు పార్టీయే గెలుస్తుందని ఆయన అన్నారు.

ఉప ఎన్నికల్లో 12 నుంచి 16 సీట్లను వైయస్ జగన్ నాయకత్వంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గెలుస్తుందని లగడపాటి రాజగోపాల్ చెప్పారు. కాంగ్రెసు పార్టీకి ఒకటి నుంచి మూడు సీట్లు వస్తాయని ఆయన చెప్పారు. తెలుగుదేశం పార్టీకి సున్నా నుంచి 2 సీట్లు వస్తాయని, తెలుగుదేశం పార్టీకి ఒక్క సీటు రాకపోయినా ఆశ్చర్యం లేదని ఆయన అన్నారు. పరకాలలో తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) విజయం సాధిస్తుందని ఆయన చెప్పారు. జగన్ అరెస్టు తర్వాత వైయస్ విజయమ్మ, షర్మిల కన్నీళ్ల ప్రచారం  వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి అనుకూలంగా మారిందని ఆయన చెప్పారు. నెల్లూరు లోకసభ స్థానం గురించి ఈ నెల 14వ తేదీన చెప్తానని ఆయన అన్నారు.