విజయమ్మపై విరుచుకుపడ్డ తులసి రెడ్డి

విజయమ్మపై విరుచుకుపడ్డ తులసి రెడ్డి

 వైయస్సార్ కాంగ్రెసు పార్టీ జగన్మోహన్‌రెడ్డిని నిర్దోషిగా నమ్మి ప్రజలు తీర్పు ఇచ్చారన్న  వైఎస్ విజయమ్మవ్యాఖ్యలను పిసిసి అధికార ప్రతినిధి తులసిరెడ్డి ఖండించారు. ప్రజా కోర్టులో గెలిచినంత మాత్రాన కోర్టులో కేసులు రద్దు చేయరన్న వాస్తవాన్ని విజయమ్మ గుర్తించాలని ఆయన సూచించారు. విజయమ్మ వ్యాఖ్యలపై తులసి రెడ్డి శనివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో తీవ్రంగా ప్రతిస్పందించారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి బలముందని భావిస్తే అసెంబ్లీలో అవిశ్వాస తీర్మానం పెట్టాలని ఆయన సవాల్ విసిరారు.

కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీ కుమ్మక్కయితే కొన్ని నియోజక వర్గాల్లో సామాజిక వర్గానికి చెందిన అభ్యర్ధులను ఎందుకు నిలబెడతామని తెలసిరెడ్డి ప్రశ్నించారు. తిరుపతిలో కాంగ్రెస్, టీడీపీకి ఒకే సామాజిక వర్గానికి చెందిన అభ్యర్ధులు పోటీ చేయడంతో కాంగ్రెస్ ఓడిపోయిందని ఆయన అన్నారు. రాష్ట్రంలో మూడోసారి కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి తీరుతుందని, మళ్ళీ కిరణ్‌కుమార్ రెడ్డే ముఖ్యమంత్రి అవుతారని తులసి రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు.

సానుభూతి వల్లనే ఉప ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గెలించిందని చెప్పడం సరి కాదని ఆర్టీసి మాజీ చైర్మన్ గోనె ప్రకాశ రావు అన్నారు. ఈ విషయంలో కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలు దుష్ప్రచారం చేస్తున్నాయని ఆయన విమర్శించారు. శనివారం ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. వైయస్ జగనే తమ నాయకుడని ఉప ఎన్నికల ద్వారా ఓటర్లు నిరూపించారని ఆయన అన్నారు.

తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) లక్ష్యం ఓట్లు, సీట్లేనని ఉప ఎన్నికల ద్వారా నిరూపితమైందని ఆయన అన్నారు. తెలంగాణలోనూ  వైయస్సార్ కాంగ్రెసు పార్టీ బలమైన పార్టీగా ఆవిర్భవిస్తుందని ఆయన అన్నారు. కాంగ్రెసు, తెలుగదేశం బంగారుపల్లెంలో అధికారాన్ని జగన్‌కు అప్పగించడం ఖాయమని ఆయన అన్నారు.