జగనే కాంగ్రెసు నేతల టార్గెట్

జగనే కాంగ్రెసు నేతల టార్గెట్

రాష్ట్రంలోని 12 శాసనసభా స్థానాలకు, ఓ లోకసభ స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నికల్లో కాంగ్రెసు అగ్ర నేతలు చెమటోడుస్తున్నారు. సాధారణ ఎన్నికల్లో కన్నా ఎక్కువగా వారు ప్రచారం సాగిస్తున్నారు. జైలు పాలైన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్‌నే వారు ప్రధాన లక్ష్యంగా చేసుకుని ఆరోపణలు చేస్తున్నారు. పనిలో పనిగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిపై వ్యాఖ్యలు చేస్తున్నారు.

 

 రాజ్యసభ సభ్యుడు చిరంజీవి, పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ దాదాపుగా ఓ జట్టుగా ఎన్నికలు జరుగుతున్న నియోజకవర్గాల్లో పర్యటిస్తూ వైయస్ జగన్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. కొద్ది రోజుల పాటు కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ గులాం నబీ ఆజాద్ కూడా కొన్ని నియోజకవర్గాల్లో పర్యటించి, జగన్‌పైనే ప్రధానంగా విమర్శలు కురిపించారు. కాంగ్రెసులో ఉంటే కేంద్ర మంత్రి అయ్యేవారని, అనుభవం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి అయ్యేవారని ఆయన చేసిన వ్యాఖ్యలు కాంగ్రెసుకు ఎదురు తిరిగాయి. ఆ తర్వాత ఆయన ఢిల్లీకి చేరుకున్నారు.

కొత్తగా కాంగ్రెసు నాయకులకు  గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మ, ఆమె కూతురు షర్మిల సవాళ్లు విసురుతున్నారు. తన భర్త వైయస్ రాజశేఖర రెడ్డి మృతిపై ఆమె అనుమానాలు వ్యక్తం చేయడం కాంగ్రెసుకు మింగుడు పడడం లేదు. దాంతో వైయస్ విజయమ్మపై కూడా వారు విమర్శలు ఎక్కుపెడుతున్నారు. వైయస్ జగన్‌ను ఆమె సమర్థించడాన్ని వారు తప్పు పడుతున్నారు. షర్మిల విమర్శలకు ఇప్పటి వరకు చిరంజీవి మాత్రమే ఎదురు మాట్లాడారు. షర్మిల, ఆమె భర్త గనుల భూములను కొల్లగొట్టడానికి ప్రయత్నించారని ఆయన ఆరోపించారు.

మరో వైపు, కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ ప్రజాహిత పాదయాత్ర పేరుతో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. జగన్‌పై కొత్త కొత్త వ్యాఖ్యలు చేయడమే ఆయన ప్రధాన లక్ష్యంగా కనిపిస్తోంది. మరో పార్లమెంటు సభ్యుడు ఉండవల్లి అరుణ్ కుమార్ కూడా రంగంలోకి దిగారు. లగడపాటి రాజగోపాల్ ప్రజాహిత పాదయాత్ర ప్రారంభం రోజు కనిపించిన కెవిపి రామచందర్ రావు ఆ తర్వాత కనిపించడం లేదు.

కాగా, తెలుగుదేశం తరఫున ఆ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అన్నీ తానే అయి ప్రచారం నిర్వహిస్తున్నారు. ఆయన ఎన్నికలు జరుగుతున్న నియోజకవర్గాల్లో సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. ఆయన కూడా వైయస్ జగన్‌నే టార్గెట్ చేస్తూ విమర్శలు చేస్తున్నారు. జగన్‌ను పెంచిన తీరుపై ఆయన విజయమ్మ మీద విరుచుకుపడుతున్నారు. కాంగ్రెసు ప్రభుత్వాన్ని పనిలో పనిగా విమర్శిస్తున్నారు. మొత్తం మీద కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీల నేతలకు వైయస్ జగన్ మాత్రమే టార్గెట్‌గా మారారు. దిమ్మ తిరిగే ఎండలో మాడిపోతూ రాజకీయ నాయకులు ప్రచారంలో తిరుగుతున్నారు.