మళ్లీ యెడ్డీ తిరుగుబాటు

మళ్లీ యెడ్డీ తిరుగుబాటు

 కర్ణాటక బిజెపి సీనియర్ నేత,  మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప మరోసారి తిరుగుబాటు బావుటా ఎగురువేశారు. ఈసారి తనకు ముఖ్యమంత్రి కావాలని అడగకుండా, గ్రామీణాబివృద్ధి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి జగదీష్ షెట్టర్‌కు ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని ఆయన తిరుగుబాటుకు పూనుకున్నారు.  సదానంద గౌడను ముఖ్యమంత్రి పీఠం నుంచి దించే ఎత్తుగడలను ఆయన ఎంచుకున్నట్లు చెబుతున్నారు.

యడ్యూరప్ప అక్రమ మైనింగ్ కేసులో సిబిఐ విచారణను ఎదుర్కుంటున్నారు. దీంతో ఆయన వర్గం షెట్టర్‌ను ముఖ్యమంత్రి పదవికి అభ్యర్థిగా ముందుకు తోస్తోంది. కర్ణాటక తాజా పరిణామాల నేపథ్యంలో ఢిల్లీ కోర్ కమిటీ సమావేశమైంది. అయితే, యడ్యూరప్ప మాత్రం మీడియాతో మాట్లాడడానికి నిరాకరించారు. తాను మాట్లాడదలుచుకున్నప్పుడు మీడియా ముందుకు వస్తానని, మరో నెల రోజుల పాటు మీడియాతో తాను మాట్లాడదలుచుకోలేదని ఆయన అన్నారు.

యడ్యూరప్ప డిమాండ్‌పై ముఖ్యమంత్రి సదానంద స్పందించారు. ముఖ్యమంత్రి కుర్చీ ఖాళీగా లేదని, తాను పూర్తి కాలం ముఖ్యమంత్రిగా ఉంటానని చెప్పారు. అయితే, నాయకత్వ మార్పు ఉంటుందనే ప్రచారం మాత్రం ముమ్మరంగానే సాగుతోంది. తాజా పరిణామాల నేపథ్యంలో సదానంద మీడియా సమావేశాన్ని నిర్ణీత సమయం కన్నా రెండు గంటల ముందే పెట్టారు. అకస్మాత్తుగా ఢిల్లీ బయలుదేరడానికి సిద్ధపడ్డారు.

ఢిల్లీ పర్యటన గురించి మీడియా ప్రతినిధులు అడగ్గా - ముఖ్యమంత్రిగా ఢిల్లీ వెళ్తున్నప్పుడు ఎవరూ ప్రశ్నించకూడదని, ఢిల్లీలో తనకు ఇప్పుడు కొన్ని పనులు ఉన్నాయని, తాను వెళ్లాల్సి ఉందని ఆయన సమాధానమిచ్చారు. నాయకత్వ మార్పు ఉంటుందనే ప్రచారాన్ని ఆయన కొట్టిపారేశారు.

ఆ తర్వాత సదానంద తన ఢిల్లీ పర్యటనను రద్దు చేసుకున్నారు. ఢిల్లీ రావాల్సిన అవసరం లేదని బిజెపి అధిష్టానం ఆయనకు చెప్పింది. దీంతో ఆయన ఢిల్లీ పర్యటనను మానుకున్నారు. ఇదే సమయంలో తాను కూడా ముఖ్యమంత్రి పదవికి రేసులో ఉన్నానని బిజెపి రాష్ట్ర శాఖ అధ్యక్షుడు ఈశ్వరప్ప అన్నారు. కొంత మంది మంత్రులు, శానససభ్యులు తన వద్దకు వచ్చి ముఖ్యమంత్రిగా మీరే ఎన్నిక కావాలని తనను అడిగారని, తాను నిరాకరించలేకపోయానని ఆయన అన్నారు.

శానససభా పక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలని యడ్యూరప్పకు విధేయులుగా ఉన్్న రాష్ట్ర మంత్రులు సిఎం ఉదాసి, ఎంపి రేణుకాచార్య, బసవరాజ బొమ్మై, మురుగేష్ నిరాని కొద్దికాలంగా ఒత్తిడి తెస్తున్నారు. శాసనసభ్యుల సమస్యలపై చర్చించడానికి ఈ సమావేశం ఏర్పాటు చేయాలని వారు బయటకు అంటున్నప్పటికీ సదానంద నాయకత్వాన్ని సవాల్ చేయాలనే ఉద్దేశంతో వారున్నట్లు తెలుస్తోంది.