పరారీలో నిత్యానందస్వామి

పరారీలో నిత్యానందస్వామి

 సెక్స్ స్కాండల్‌లో ఇరుక్కున్న నిత్యానంద స్వామీ ఆస్తులను స్వాధీనం చేసుకునేందుకు రంగం సిద్ధమవుతోంది. బెంగళూరు సమీపంలోని బిడది ధ్యానపీఠం ఆశ్రమంలో సోదాలు నిర్వహించి, ఆ ఆస్తులను స్వాధీనం చేసుకోవాలని ప్రభుత్వం అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లుగా తెలుస్తోంది. బిడది ఆశ్రమం స్వాధీనంతో పాటు సెక్స్ స్కాంలో పొందిన బెయిల్ పిటిషన్ రద్దుకు హోంశాఖ ప్రయత్నాలు చేస్తోంది. ఆయన బెయిల్‌ను రద్దు చేయించే దిశలో పావులు కదుపుతోంది.

నిత్యానంద స్వామి ఘటనపై కర్నాటక రాష్ట్ర ముఖ్యమంత్రి సదానంద గౌడ సీరియస్ అయ్యారు. రెండు రోజుల్లో నిత్యానందను అరెస్టు చేస్తామని చెప్పారు. నిత్యానంద పరారీ నేపథ్యంలో బిడదిలోని ఆయన ఆశ్రమానికి తాళాలు వేయాలని ఆదేశించారు. ఆయనపై దర్యాఫ్తునకు ఆదేశాలు జారీ చేశారు. ఆశ్రమంలో ఏఏ వస్తువులు ఉన్నాయో ఆరా తీయాలని సూచించింది. నిత్యానంద స్వామి అమాయక మహిళళపై అత్యాచారం చేశాడనే ఆరోపణలను ఎదుర్కొంటున్నాడు.

ఇటీవల బిడది ఆశ్రమ ఘటన కారణంగా నిత్యానంద అదృశ్యమైన విషయం తెలిసిందే. వారం రోజుల క్రితం ఓ నటి తనను నిత్యానంద బలవంతంగా రేప్ చేశారని ఆరోపించింది. ఆమెను నిత్యానంద దాదాపు పలుమార్లు రేప్ చేశాడనే ఆరోపణలు ఉన్నాయి. ఆమె ఆరోపణలు ఖండించేందుకు నిత్యానంద నాలుగు రోజుల క్రితం బిడది ఆశ్రమంలో ప్రెస్ మీట్ పెట్టారు. ఈ ప్రెస్ మీట్‌లో ఓ విలేకరి అడిగిన ప్రశ్నతో నిత్యానందకు కోపం వచ్చింది. తన అనుచరులతో రిపోర్టర్‌ను తోసివేశారు. బయటకు గెంటివేశారు.

దీంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఆ తర్వాత విలేకరులు ఆందోళనకు దిగారు. రిపోర్టర్ పైన దాడి కేసులో నిత్యానందతో పాటు ఆయన శిష్యుల పైన కేసు నమోదయింది. పోలీసులు అశ్రమంలోని పలువురిని అదుపులోకి తీసుకున్నారు. శిష్యులను అరెస్టు చేయడంతో నిత్యానంద అదృశ్యమయ్యాడు. నాలుగు రోజులుగా ఆయన ఎవరికీ కనిపించడం లేదు. తమిళనాడులోని మైసూరూలో ఉండవచ్చునని, బిడదిలోనే ఉండవచ్చునని ఇలా పలు ప్రాంతాలలో ఆయన కోసం పోలీసులు గాలించారు.

కాని నిత్యానంద ఆచూకి మాత్రం లభించలేదు. బిడది ఘటనపై నిత్యానందతో పాటు ఆయన అనుచరులపై పోలీసులు రెండు కేసులు నమోదు చేశారు. నిత్యానందను రాష్ట్రం నుండి బహిష్కరించాలని ప్రజా సంఘాలు డిమాండ్ చేశాయి. నిత్యానంద బిడది ఆశ్రమం పన్నెండు ఎకరాలలో వ్యాపించి ఉంటుంది.