వైయస్ అల్లుడు అనిల్‌కు షాక్

వైయస్ అల్లుడు అనిల్‌కు షాక్

 బయ్యారం గనుల లీజును రద్దు చేస్తూ ప్రభుత్వం ఓకే చెప్పింది. సాయంత్రంలోగా ఇందుకు సంబంధించి ఉత్తర్వులు జారీ చేసే అవకాశముంది. రక్షణ స్టీల్స్‌తో ఒప్పందం రద్దుకు ఆంధ్రప్రదేశ్ మినరల్ డెవలప్‌మెంట్ కార్పోరేషన్(ఎపిఎండిసి)కు ప్రభుత్వం అనుమతిచ్చింది. బయ్యారం గనుల లీజును రద్దు చేయాలంటూ ప్రభుత్వం ఖనిజాభివృద్ధి సంస్థకు ఆదేశాలు జారీ చేసింది.

బయ్యారం గనులు ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో విస్తరించి ఉన్నాయి. ప్రధానంగా ఖమ్మం జిల్లాలోనే గనులు ఉన్నాయి. లక్షా నలభై వేలకు పైగా ఎకరాలను అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం రక్షణ స్టీల్స్‌కు కేటాయించింది. నాలుగు మండలాలలో గనులను కేటాయించారు. ఖమ్మం జిల్లాలోని గార్ల, బయ్యారం, నేలకొండపల్లితో పాటు వరంగల్ జిల్లా గూడూరు మండలాలలో భూములు కేటాయించారు. రోశయ్య హయాంలోనే కొన్ని లీజులు రద్దు చేశారు. ఇప్పుడు పూర్తిగా రద్దు చేశారు.

కాగా రక్షణ స్టీల్స్ దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి అల్లుడు బ్రదర్ అనిల్ కుమార్‌కు చెందినది. ఈ సంస్థకు వైయస్ ప్రభుత్వం అప్పట్లో లక్షా నలభై వేలకు పైగా ఎకరాలలో తవ్వుకునేందుకు అనుమతించింది. బయ్యారం గనుల లీజు ఒప్పందం రక్షణ స్టీల్స్, ఎపిఎండిసికి మధ్య జరిగింది. దానినే ఇప్పుడు ప్రభుత్వం రద్దు చేసింది. బయ్యారం గనుల కేటాయింపుపై పలువురు నేతలు హర్షం వ్యక్తం చేశారు.

బయ్యారం గనుల కేటాయింపుపై అసెంబ్లీలో తాము సుదీర్ఘ పోరాటం చేశామని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ అన్నారు. వైయస్ ఉన్నప్పుడు బయ్యారం గనుల లీజును రద్దు చేయాలని తాము డిమాండ్ చేశామని కాంగ్రెసు నేత పొంగులేటి సుధాకర్ రెడ్డి అన్నారు. సిరిపురం గ్రామంలో శ్రీపురం పేరిట ఇప్పటికే అక్రమ మైనింగ్ జరుగుతోందని విమర్శించారు. గనుల లీజు రద్దును స్వాగతిస్తున్నట్లు చెప్పారు. కాగా రక్షణ స్టీల్స్‌తో అనిల్‌కు ఎలాంటి సంబంధం లేదని ఆయన సన్నిహితులు ప్రకటించారు.