బిజెపికి జయ షాక్

బిజెపికి జయ షాక్

 రాష్ట్రపతి అభ్యర్థిగా పిఎ సంగ్మాకు మద్దతు ఇస్తున్న బిజెపికి తమిళనాడు ముఖ్యమంత్రి,  అన్నాడియంకె అధినేత జయలలిత షాక్ ఇచ్చారు. సంగ్మాను బలపరిచే విషయంలో ఆమె పునరాలోచనలో పడినట్లు తెలుస్తోంది. జయలలిత గురువారం బిజెపి అగ్రనేత ఎల్‌కె అద్వానితో ఫోన్‌లో మాట్లాడినట్లు తెలుస్తోంది. రాష్ట్రపతి ఎన్నిక నుంచి సంగ్మా తప్పుకోవాలని ఆమె సూచించినట్లు సమాచారం.

జయలలిత మాటలతో దిగ్భ్రాంతికి గురైన బిజెపి తాజా పరిస్థితిని సమీక్షిస్తోంది. నామినేషన్ దాఖలు చేసిన తర్వాత రేసు నుంచి సంగ్మా తప్పుకోవాలని జయలలిత సూచించినట్లు తెలుస్తోంది. సంగ్మా నామినేషన్ దాఖలు కార్యక్రమానికి రావాలని ఫోన్ చేసి అద్వానీ జయలలితను ఆహ్వానించారని అంటున్నారు. ఈ సమయంలో జయలలిత ఆ సూచన చేసినట్లు తెలుస్తోంది.

తాను నెల పాటు కోడనాడులో చికిత్స తీసుకుంటున్నానని, అందు వల్ల తాను ప్రయాణం చేయలేనని చెబుతూ అద్వానీ అహ్వానాన్ని జయలలిత తిరస్కరించినట్లు చెబుతున్నారు. ఇదిలా వుంటే, రాష్ట్రపతి అభ్యర్థిగా సంగ్మా గురువారం మధ్యాహ్నం నామినేషన్ దాఖలు చేశారు. నాలుగు సెట్ల నామినేషన్ పత్రాలను ఆయన సమర్పించారు.

సంగ్మా నామినేషన్ దాఖలు కార్యక్రమానికి బిజెపి అగ్ర నేతలు ఎల్‌కె అద్వానీ, సుష్మా స్వరాజ్, నితిన్ గడ్కరీ, అరుణ్ జైట్లీ, పంజాబ్ ముఖ్యమంత్రి బాదల్, ఒడిషా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ హాజరయ్యారు. యుపిఎ అభ్యర్థి ప్రణబ్ ముఖర్జీ గురువారం ఉదయమే నామినేషన్ దాఖలు చేశారు.