రాష్ట్రపతి రేసులో రోశయ్య

రాష్ట్రపతి రేసులో రోశయ్య

ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత తమిళనాడు గవర్నర్ కొణిజేటి రోశయ్య రాష్ట్రపతి రేసులో ఉన్నారు. రాష్ట్రపతి అభ్యర్థిత్వంపై శుక్రవారం కాంగ్రెసు పార్టీ కోర్ కమిటీ సమావేశమైన విషయం తెలిసిందే. ఈ సమావేశంలో రోశయ్య పేరును కూడా కాంగ్రెసు పార్టీ అధిష్టానం పరిశీలించినట్లుగా తెలుస్తోంది. పలువురు నేతలు రోశయ్య పేరును ప్రస్తావించినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో రోశయ్య ఆమోదయోగ్యమైన నేత అని పార్టీలోని పలువురు అభిప్రాయపడుతున్నారని అంటున్నారు.

రోశయ్య రాష్ట్రపతి అవుతారా లేదా అనే విషయం పక్కన పెడితే పార్టీ అధిష్టానం వ్యూహాత్మకంగానే ఆయన పేరును తెరపైకి తీసుకు వచ్చి ఉంటుందనే వాదనలు వినిపిస్తున్నాయి. ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెసు పార్టీకి చాలా ప్రధాన్యత కలిగిన రాష్ట్రం. గత సాధారణ ఎన్నికలలో 33 స్థానాలలో కాంగ్రెసు విజయబావుటా ఎగుర వేసింది(అందులో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప ఎంపీ వైయస్ జగన్మోహన్ రెడ్డి వేరు కుంపటి పెట్టుకోగా, నెల్లూరు ఎంపి మేకపాటి రాజీనామా చేయగా, ఉప ఎన్నిక ఈ నెల 12న జరగనుంది).

33 స్థానాలలో గెలుపుతో... కేంద్రంలో కాంగ్రెసు ఆధ్వర్యంలోని యుపిఏ అధికారంలోకి రావడానికి ఆంధ్రప్రదేశ్ కీలకమైంది. ఈ నేపథ్యంలో ప్రస్తుత రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆంధ్ర ప్రదేశ్‌పై అధిష్టానం ప్రత్యేక దృష్టి సారించింది. 2014 ఎన్నికలలో మరోసారి కాంగ్రెసు కేంద్రంలో అధికారంలోకి రావాలంటే ఎపి కీలక పాత్ర పోషించాల్సిందే. ఇలాంటి సమయంలో వైయస్ జగన్ పార్టీ వీడి వేరు కుంపటి పెట్టుకున్నారు.

ఆయన కాంగ్రెసుకు పెద్ద సవాల్ విసురుతున్నారు. జగన్ ప్రభావం కారణంగా రాష్ట్రంలో కాంగ్రెసు మూడో స్థానంలోకి పడిపోయిందన్న వాదనలు వినిపిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం కూడా కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతోందని, ఏ క్షణంలో ఏవరైనా జగన్ వెంట వెళ్లేందుకు 
సిద్ధంగా ఉన్నారనే ప్రచారం రోజు రోజుకు పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ఆంధ్ర ప్రదేశ్ ప్రజలను మచ్చిక చేసుకునే ఉద్దేశ్యంలో భాగంగా రోశయ్య పేరును తెరపైకి తీసుకు వచ్చి ఉంటారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

కాగా కొణిజేటి రోశయ్య కాంగ్రెసు పార్టీలో చాలా సీనియర్ నేత. ఆయన వైశ్య సామాజిక వర్గానికి చెందిన నేత. ఎపిలో కాంగ్రెసు అధికారంలోకి వస్తే ఆర్థిక మంత్రిగా ఆయనే ఉండేవారు. రికార్డు స్థాయిలో పదహారుసార్లు రాష్ట్ర బడ్జెట్ ప్రవేశ పెట్టిన చరిత్ర రోశయ్యకు ఉంది. వివాదాస్పదుడు. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి మరణానంతరం అనూహ్య పరిస్థితుల్లో ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు.

అంతే అనూహ్య పరిస్థితులలో ఏడాదిలోగా ఆయన సిఎం పదవికి రాజీనామా చేశారు. ప్రస్తుతం ఆయన తమిళనాడు గవర్నర్‌గా కొనసాగుతున్నారు. రోశయ్య ఎప్పుడూ అధిష్టానానికి విశ్వాసపాత్రుడు. పదవులు ఉన్నా లేకపోయినా పట్టింపులకు పోకుండా కాంగ్రెసులోనే కొనసాగుతారు. ఆయన విశ్వాసమే ఆయనను ముఖ్యమంత్రిగా ఆ తర్వాత గవర్నర్‌గా చేసింది. మరి ఇప్పుడు రాష్ట్రపతిగా చేస్తుందో లేదో చూడాలి.