అంత టైం లేదు,'జగన్'పై రాములమ్మ

అంత టైం లేదు,'జగన్'పై రాములమ్మ

 వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి వ్యవహారంపై స్పందించే సమయం తమకు లేదని  తెలంగాణ రాష్ట్ర సమితి మహిళా నేత,  మెదక్ పార్లమెంటు సభ్యురాలు విజయశాంతి బుధవారం అన్నారు. ఆమె వరంగల్‌లో మాట్లాడారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ  గౌరవ అధ్యక్షురాలు, పులివెందుల శాసనసభ్యురాలు వైయస్ విజయమ్మ సమైక్య పార్టీ ప్రతినిధిగా వరంగల్ జిల్లా పరకాల నియోజకవర్గ ప్రచారానికి వస్తున్నారన్నారు.

 

తెలంగాణపై నిర్ణయం చెప్పాకే విజయమ్మ పరకాలకు రావాలని డిమాండ్ చేశారు. విజయమ్మ కన్నీళ్లను చూసి పరకాల ప్రజలు కరుగరన్నారు. జగన్ సెంటిమెంట్ కంటే తెలంగాణ సెంటిమెంటే పెద్దది అన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి మరణంపై గురించి తనకు ఏమీ తెలియదని, ఇరు పార్టీలు ఆరోపణలు చేసుకుంటున్నాయని, తెలియని దాని గురించి తానేమీ మాట్లాడనన్నారు. అితే వైయస్ మరణం మాత్రం రాజకీయం చేస్తున్నట్లుగా కనిపిస్తోందని, అది సరికాదన్నారు.

ఇప్పటికే పలు సమైక్యవాద పార్టీలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, కొత్తగా మరో సమైక్య పార్టీని తిప్పి కొట్టాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. ఎన్నికలు ఎప్పుడు జరిగినా గెలుపు తెలంగాణవాదానిదే అవుతుందన్నారు. జగన్ అంశంపై మాట్లాడేందుకు తమకు సమయం లేదని, మా దృష్టంతా తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన పైనే అన్నారు.

తెలంగాణలో ఉన్నది ప్రత్యేక సెంటిమెంట్ తప్ప మరొకటి లేదన్నారు. జగన్ సెంటిమెంట్ పని చేయదన్నారు. స్పష్టమైన వైఖరి చెప్పకుండా పరకాలకు వస్తే ప్రజలు ఊరుకోరన్నారు. ఓట్లు చీల్చేందుకే భారతీయ జనతా పార్టీ పరకాలలో పోటీ చేస్తోందన్నారు. తెలంగాణ ఓట్లు చీల్చి సమైక్యవాదులకు లబ్ధి చేకూరకుండా ఉండేందుకు బిజెపి దయచేసి పోటీ నుండి తప్పుకోవాలని సూచించారు. తెలంగాణ తప్పకుండా వస్తోందని, కానీ ఎప్పుడు వస్తుందో చెప్పలేమన్నారు.