జగన్‌ను నియంతన్న రేవంత్‌ రెడ్డి

జగన్‌ను నియంతన్న రేవంత్‌ రెడ్డి

 వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి పైన, కాంగ్రెసు పార్టీ పైన తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి రేవంత్ రెడ్డి ఆదివారం తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కాంగ్రెసు పార్టీకి, వైయస్ జగన్ పార్టీకి ఓటేస్తే ప్రజాస్వామ్య ఉనికికే ప్రమాదమని ఆయన అన్నారు. ప్రజాస్వామ్యాన్ని ప్రజలే కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. జగన్‌కు ఓటేస్తే ఓ నియంతకు ఓటేసినట్లేనని అన్నారు.

రిటైల్ అవినీతితో లాభం లేదని హోల్‌సేల్ అవినీతి కోసమే జగన్ కొత్త పార్టీ పెట్టారన్నారు. ఆర్థిక నేరగాళ్లంతా విహారయాత్రకు వెళుతున్నట్లు జైళ్లకు వెళుతున్నారని విమర్శించారు. కాంగ్రెసు పార్టీ కాటికి వెళ్లేందుకు సిద్ధంగా ఉందన్నారు. కాంగ్రెసు, వైయస్సార్ కాంగ్రెసును ఓడించాలని పిలుపునిచ్చారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీని గెలిపిస్తే దోపిడీకి లైసెన్స్ ఇచ్చినట్లే అన్నారు.

శవాలు, సెంటిమెంట్‌తో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవ అధ్యక్షురాలు, పులివెందుల శాసనసభ్యురాలు రాజకీయ లబ్ధి కోసం ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. ఇడుపులపాయ ముడుపులతో రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. కోలా కృష్ణమోహన్ వ్యవహారంపై తాము న్యాయపరంగా వెళతామని చెప్పారు.

అసాంఘీక శక్తులకు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అడ్డా అని మరో నేత వర్ల రామయ్య గుంటూరులో అన్నారు. నేర చరితులకు జగన్ పార్టీ నిలయం అన్నారు. రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి ఇంతలా అవినీతికి పాల్పడలేదని దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి ఉద్దేశించి అన్నారు. ఇప్పటికే సిబిఐ మూడు ఛార్జీషీటులతో బండారాన్ని బయట పెట్టిందని ఎల్లలు దాటిన జగన్ అవినీతి పైన మరో ముప్పై ఛార్జీషీట్లు దాఖలవుతాయని విమర్శించారు. జగన్ మహా జాదూ అన్నారు.