మోసానికే రాయల తెలంగాణ ప్రతిపాదన

మోసానికే రాయల తెలంగాణ ప్రతిపాదన

 తెలంగాణ ప్రజలను మోసం చేయడానికే రాయల తెలంగాణ ప్రతిపాదనను ముందుకు తెస్తున్నారని తెలుగుదేశం తెలంగాణ ప్రాంత శాసనసభ్యుడు మోత్కుపల్లి నర్సింహులు విమర్శించారు. తెలంగాణ ప్రజలను మోసం చేయడానికే కాంగ్రెసు నిర్ణయించుకుందని ఆయన శుక్రవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు.

రాయల తెలంగాణ ప్రతిపాదనకు తాము అంగీకరించబోమని ఆయన అన్నారు. ప్రస్తుత ముఖ్యమంత్రిని దించేసి తెలంగాణ నాయకుడిని రాష్ట్ర ముఖ్యమంత్రిని చేస్తే ఒరిగేదేమీ ఉండదని ఆయన అన్నారు. కాంగ్రెసు మోసాన్ని సహించే స్థితిలో తెలంగాణ ప్రజలు లేరని ఆయన అన్నారు. తెలంగాణపై కాంగ్రెసు నాన్చుడు ధోరణి సరైంది కాదని ఆయన అన్నారు.

రాష్ట్ర విభజన అంశాన్ని ప్రభుత్వం వెంటనే తేల్చాలని బిజెపి శానససభ్యుడు లక్ష్మీనారాయణ డిమాండ్ చేశారు. రాయల తెలంగాణ ప్రతిపాదనను తమ పార్టీ వ్యతిరేకిస్తుందని ఆయన శుక్రవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. తెలంగాణకు చెందిన పది జిల్లాలతోనే తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని ఆయన అన్నారు. తమ పార్టీ మద్దతు ప్రకటించినప్పటికీ ఇంకా కేంద్రం తెలంగాణపై నాన్చడం, దాటవేసే ధోరణిని అవలంబించడం సరి కాదని ఆయన అన్నారు.

రెండు నెలల్లో తెలంగాణ ఏర్పాటు తథ్యమని కాంగ్రెసు తెలంగాణ ప్రాంత పార్లమెంటు సభ్యుడు గుత్తా సుఖేందర్ రెడ్డి శుక్రవారం నల్లగొండలో అన్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత మంత్రి కె. జానా రెడ్డి కీలక నేతగా వ్యవహరిస్తారని ఆయన అన్నారు.