యుపిఎ రాష్ట్రపతి అభ్యర్థి ప్రణబ్

యుపిఎ రాష్ట్రపతి అభ్యర్థి ప్రణబ్

 కాంగ్రెసు నేతృత్వంలోని ఐక్య ప్రగతిశీల కూటమి (యుపీఏ) రాష్ట్రపతి అభ్యర్థిగా కేంద్ర  ఆర్థిక శాఖా మంత్రి ప్రణబ్ ముఖర్జీ పేరు దాదాపుగా ఖరారైనట్లు సమాచారం. ఈ మేరకు యుపీఏ అధ్యక్షురాలు సోనియా గాంధీ 15వ తేదీన ఒక ప్రకటన చేసే అవకాశాలున్నాయి. మీరా కుమార్, ప్రణబ్ ముఖర్జీల పేర్లు ప్రముఖంగా వినిపించినప్పటికీ చివరికి ప్రణబ్ ముఖర్జీ పేరునే ఖరారు చేసినట్లు తెలుస్తోంది.

ఈ నెల 16వ తేదీన రాష్ట్రపతి పదవికి ప్రణబ్ ముఖర్జీ నామినేషన్ దాఖలు చేసే అవకాశం ఉంది. జులై 25తో ప్రతిభాపాటిల్ ఐదేళ్ళ పదవీకాలం ముగుస్తోంది. దీంతో కేంద్ర ఎన్నికల సంఘం నూతన రాష్ట్రపతి ఎన్నిక నిర్వహణకు సమాయత్తమైంది. ఈ క్రమంలో జూన్ 13న ఈసీ నోటిఫికేషన్ వెలువరించనుంది. 20వ తేదీలోపు నామినేషన్ దరఖాస్తుల ఘట్టం ముగుస్తుంది. జులై 24లోపు నూతన రాష్ట్రపతి ఎన్నిక పూర్తవుతుంది.

ఇటీవల జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్యుసీ) సమావేశాల్లో పార్టీ తరపున రాష్ట్రపతి అభ్యర్థిని ఖరారు చేసే అధికారం అధ్యక్షురాలు సోనియా గాంధీకి అప్పగిస్తూ సభ్యులందరూ ఏకవాక్య ఏకగ్రీవ తీర్మానాన్ని ఆమోదించారు. ఈ తీర్మానాన్ని సిడబ్ల్యుసీ సమావేశంలో ప్రణబ్ ముఖర్జీయే ప్రతిపాదించారు. ఆ తరువాత సోనియా గాంధీ యుపీఏ భాగస్వామ్య పక్షాలతో విస్తృతంగా మంతనాలు జరిపారు.

తృణమూల్ కాంగ్రెస్ మినహా మిగతా అన్ని భాగస్వామ్య పార్టీలు ప్రణబ్ అభ్యర్థిత్వానికి సానుకూలంగా స్పందించాయి. అలాగే యుపీఏ కూటమిలో లేని ఉత్తరప్రదేశ్ అధికార సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ), ప్రతిపక్ష బహుజన సమాజ్‌వాదీ పార్టీ (బీఎస్పీ) కూడా ప్రణబ్ అభ్యర్థిత్వానికి అంగీకారం తెలిపాయి. తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ, ప్రణబ్ అభ్యర్థిత్వాన్ని అంగీకరించక పోయినా, ఒక బెంగాలీని రాష్ట్రపతి కాకుండా అడ్డుకునే ప్రయత్నం చేయకపోవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.