పొన్నాలను ప్రశ్నించిన సిబిఐ

పొన్నాలను ప్రశ్నించిన సిబిఐ

హైదరాబాద్:  రాష్ట్ర ఐటి శాఖ మంత్రి పొన్నా లక్ష్మయ్య ను సిబిఐ గురువారం సుదీర్ఘంగా విచారించింది. సాయంత్రం ఆరు గంటల తర్వాత కూడా విచారణ కొనసాగడంతో ఆయనను అరెస్టు చేస్తారా, వదిలేస్తారా అనే ఉత్కంఠ నెలకొంది. చివరకు సాయంత్రం ఏడు గంటల తర్వాత సిబిఐ పొన్నాలను విచారించడం ముగించింది. దాదాపు ఏడున్నర గంటల పాటు సిబిఐ అధికారులు పొన్నాల లక్ష్మయ్యను విచారించారు.

 

వివిధ సిమెంట్ ఫ్యాక్టరీలకు నదీ జలాలను విడుదల చేస్తూ జారీ చేసిన జీవోలపై సిబిఐ అధికారులు పొన్నాల లక్ష్మయ్యను విచారించారు. ఇండియా సిమెంట్స్, దాల్మియా, పెన్నా, రఘురాం సిమెంట్స్ కర్మాగారాలకు నీరు విడుదల చేస్తూ ఆయన జీవోలు జారీ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా వాటికి నీటిని విడుదల చేశారని పొన్నాలపై ఆరోపణలు వచ్చాయి.

వైయస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వ హయాంలో ఆయన భారీ నీటి పారుదల శాఖ మంత్రిగా పనిచేశారు. ఇండియా సిమెంట్స్‌కు నీటి విడుదలపైనే ప్రధానంగా సిబిఐ పొన్నాలను ప్రశ్నించినట్లు తెలుస్తోంది. తన హయాంలో విడుదలైన 146, 94 జీవోలపై సిబిఐ అధికారులు పొన్నాలను ప్రశ్నించారు. ఆయనతో పాటు ఐఎఎస్ అధికారి ఆదిత్యనాథ్‌ను కూడా సిబిఐ అధికారులు విచారించారు. సిబిఐ విచారణ అనంతరం పొన్నాల మీడియాతో మాట్లాడకుండానే వెళ్లిపోయారు. రేపు విచారణకు వస్తారా అని మీడియా ప్రతినిధులు అడిగినా ఆయన సరైన సమాధానం ఇవ్వలేదు.

విచారణ తర్వాత మిగిలిన విషయాలు మాట్లాడతానని ఆయన సిబిఐ విచారణకు వెళ్లే ముందు చెప్పారు. కోర్టులను తాము గౌరవిస్తామని చెప్పారు. నవ్వుతూ వెళితే మేకపోతు గాంభీర్యం అంటారని, లేదంటే ఆందోళనగా ఉన్నారని అంటారని పొన్నాల మీడియాతో చలోక్తులు వేశారు. మరోవైపు ఐఏఎస్ అధికారి ఆదిత్యనాద్ దాస్ కూడా సిబిఐ విచారణకు హాజరయ్యారు. సిమెంట్ కర్మాగారాలకు ప్రయోజనం చేకూర్చే విధంగా జీవోలు జారీ చేశారని పొన్నాల లక్ష్మయ్యపై ఆరోపణలు ఉన్నాయి.