నిత్యానంద ఆశ్రమంలో పోలీసుల సోదాలు

నిత్యానంద ఆశ్రమంలో పోలీసుల సోదాలు

చెన్నై:  వివాదాస్పద నిత్యానంద స్వామి కి చెందిన తమిళనాడులోని మధురై ఆశ్రమంలో పోలీసులు మంగళవారం సోదాలు నిర్వహించారు. వన్యప్రాణి సంరక్షణ చట్టాన్ని ఉల్లంఘించారనే ఆరోపణలు రావడంతో ఈ పోలీసులు ఈ సోదాలు నిర్వహించారు. ఆశ్రమంలో ఏనుగు తొండాల కోసం, పులి చర్మాల కోసం పోలీసులు ఈ సోదాలు నిర్వహించారు.

నిత్యానంద స్వామి మధురై మఠంలో పులి చర్మంపై కూర్చున్నారని, దానిపై ఏనుగు తొండాలు పరిచి ఉన్నాయని వచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఇంతకు ముందు కేసు నమోదు చేశారు. ఆ సమయంలో మఠంలో ఉన్న ఓ వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు సినీ నటి రంజితపై, మహిళా పిఆర్వోపై కూడా పోలీసులు కేసులు పెట్టారు.

నిత్యానంద స్వామి పానీయం తాగించి, ఆ తర్వాత ఆంగ్ల పాటలకు నృత్యం చేయాలని సూచించేవాడని, అతని బృందం సభ్యులు కూడా ఆ ఆదేశాలు ఇచ్చేవారని పిటిషనర్ ఆరోపించారు. అయితే, ఇందుకు సంబంధించి సరైన సాక్ష్యాధారాలు రాబట్టలేకపోతున్నట్లు తెలుస్తోంది.

ఓ నటితో రాసలీలలు నడిపినట్లు ఆరోపిస్తూ బయటకు వచ్చిన వీడియోల కేసులో ఆయన 2010లో మొదటి సారి అరెస్టయ్యాడు. ఆ కేసులో ఆయన బెయిల్‌పై విడుదలయ్యాడు. ఆ తర్వాత 2012లో జైలు ఊచలు లెక్కించాల్సి వచ్చింది. మీడియా ప్రతినిధులపై దాడి చేశారనే అభియోగాలను ఆయన ఎదుర్కున్నారు. రేప్, లైంగిక వేధింపులు వంటి ఆరోపణలు కూడా అతన్ని చుట్టుముట్టాయి. విదేశీ వనితను లైంగిక వేధించిన కేసులో నిత్యానందను అరెస్టు చేయాలని కర్ణాటక ముఖ్యమంత్రి సదానంద గౌడ ఆదేశాలు జారీ చేశారు.