పార్టీ అంతర్గత సమస్యనే:తలసాని

పార్టీ అంతర్గత సమస్యనే:తలసాని

 తాను మరో దారి వెతుక్కోనని  మాజీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ అన్నారు. ఆయన తెలుగుదేశం పార్టీకి దూరమవుతున్నట్లు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీలోనో కాంగ్రెసు పార్టీలోనో చేరబోతున్నట్లు వార్తలు వచ్చాయి. మొదట వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరబోతున్నట్లు వార్తలు వచ్చాయి. ఆ తర్వాత కాంగ్రెసు పార్టీలో చేరబోతున్నట్లు వార్తలు వచ్చాయి. దీంతో ఆయన సోమవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో ఆ విషయం స్పష్టం చేశారు. 

తనకు సంబంధించి పార్టీ అంతర్గత సమస్యనే తప్ప మరోటి కాదని, తాను మరో పార్టీకి వెళ్లబోనని తలసాని శ్రీనివాస యాదవ్ అన్నారు. వైయస్ జగన్ ఆస్తుల కేసులో ఒక్క మోపిదేవి వెంకటరమణను మాత్రమే అరెస్టు చేయడం సరి కాదని, మిగతా మంత్రులను కూడా అరెస్టు చేయాలని ఆయన అన్నారు. గత ఐదేళ్ల పాటు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ అవినీతి కాంగ్రెసు పార్టీకి కనిపించలేదా అని ఆయన అడిగారు. 

పార్టీ సీనియర్ నేత దేవేందర్ గౌడ్‌ను పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు రాజ్యసభకు పంపించడం పట్ల తలసాని శ్రీనివాస్ యాదవ్ అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. దాంతో ఆయన వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరుతారంటూ మొదట వార్తలు వచ్చాయి. అలాగే, ఈ మధ్య ఆయన సచివాలయంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని కలిశారు. దాంతో ఆయన కాంగ్రెసులో చేరడానికి సిద్ధపడుతున్నట్లు వార్తలు వచ్చాయి. 

తాను కాంగ్రెసులో చేరబోతున్నట్లు వచ్చిన వార్తలపై శ్రీనివాస యాదవ్ తీవ్రంగా మండిపడ్డారు. తాను సికింద్రాబాదులోని మోండా మార్కెట్ సమస్యలపై ముఖ్యమంత్రిని కలిశానని ఆయన అన్నారు. అంతేకాకుండా తాను ముఖ్యమంత్రిని సచివాలయంలో కలిశానని, గాంధీభవన్ కలవలేదని చెబుతూ అలాంటి వార్తలు రాయడం సరి కాదని ఆయన అన్నారు.