కలిసిన వారికి ఇదే మాట చెప్పా

కలిసిన వారికి ఇదే మాట చెప్పా

 తెలంగాణ అంశంపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించిందని కేంద్ర హోంశాఖ మంత్రి చిదంబరం శుక్రవారం చెప్పారు. ఆయన న్యూఢిల్లీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మధ్యాహ్నం మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన.. త్వరలో తెలంగాణపై కేంద్రం తుది నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. దీనిపై వీలైనంత త్వరగా నిర్ణయం తీసుకోవాలని కేంద్రం భావిస్తోందని చెప్పారు. తనను కలిసిన తెలంగాణ ప్రజా ప్రతినిధులకు కూడా తాను ఇదే విషయాన్ని చెప్పానని తెలిపారు. తనను కలిసిన ఆంధ్ర ప్రదేశ్ నాయకులు తెలంగాణ సమస్యను త్వరగా పరిష్కరించాలని కోరుతున్నారని చెప్పారు.

ఈ విషయంలో ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.  అన్ని పార్టీలు ఇదే తెలంగాణపై తీవ్రంగా చర్చిస్తున్నాయని చెప్పారు. కాంగ్రెసు పార్టీతో పాటు నిర్ణయం చెప్పని మిగతా పార్టీలు కూడా తమ నిర్ణయాన్ని చెప్పాల్సి ఉందన్నారు. తెలంగాణపై సాధ్యమైనంత త్వరగా నిర్ణయం తీసుకుంటుందని, కానీ ఖచ్చితమైన టైమ్ లిమిట్ మాత్రం ఏదీ లేదని చెప్పారు. అయితే అంతిమ నిర్ణయం తీసుకోవాల్సి ఉందని మాత్రం ఆయన అభిప్రాయపడ్డారు.

శిక్షాకాలం పూర్తయిన ఐదుగురు ఖైదీలను పాకిస్తాన్‌కు పంపించామని చెప్పారు. ఉగ్రవాది జుందాల్‌ను పాకిస్తానే ప్రోత్సహించిందని ఆరోపించారు. 26/11 ఘటనలో జుందాల్ కీలక సూత్రధారి అన్నారు. ఇతని అరెస్టు అత్యంత కీలకమైనదన్నారు. హైదరాబాదులోని మక్కామసీదు కేసులో ఇద్దరు నిందితులను పట్టుకున్నట్లు చెప్పారు. అమరనాథ్ యాత్రకు పూర్తి భద్రత ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు.

కాశ్మీర్‌కు అదనపు బలగాలను పంపిస్తున్నట్లు చెప్పారు. ఐపిఎస్ అధికారులు తమ ఆస్తుల వివరాలను ప్రభుత్వానికి ఇవ్వాలని సూచించారు. ఛత్తీస్‌గఢ్ ఎన్‌కౌంటర్‌లో పద్దెనిమిది మంది నక్సలైట్లు మృతి చెందినట్లు తెలిపారు. తొలుత మావోయీస్టులే సిఆర్‌పిఎఫ్ జవాన్‌లపై కాల్పులు జరిపారని, కాల్పులు ఓ పథకం ప్రకారమే జరిగాయని చిదంబరం మీడియా సమావేశంలో తెలిపారు. అంతకుముందు ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు, రవాణా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ కేంద్రమంత్రి చిదంబరంను కలిశారు.

కాగా ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లా పసాకోట పరిధిలో ఉదయం మావోయిస్టులకు పోలీసులకు మధ్య గంటపాటు ఎన్‌కౌంటర్ సాగినట్లు కేంద్ర హోంశాఖ ప్రకటించింది. ఈ ఎన్‌కౌంటర్‌లో 18 మంది మావోయిస్టులు మృతి చెందారని, మరికొంతమంది తీవ్రంగా గాయపడ్డారని తెలిపింది. ఆరుగురు సిఆర్‌పిఎఫ్ జవాన్లకు గాయాలయ్యాయని, వారిని రాయపూర్ ఆసుపత్రికి తరలించినట్లు చెప్పారు. చికిత్స పొందుతున్న జవాన్లలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.