స్వల్ప ఘర్షణలు మినహా పోలింగ్ ప్రశాంతం

స్వల్ప ఘర్షణలు మినహా పోలింగ్ ప్రశాంతం

 రాష్ట్రంలోని 18 శానససభా స్థానాలు, ఓ లోకసభ స్థానాల్లో పోలింగ్ మంగళవారం దాదాపు ప్రశాంతంగా ముగిసింది. కొన్ని చోట్ల స్వల్ప ఘర్షణలు చోటు చేసుకున్నాయి. రామచంద్రాపురం నియోజకవర్గంలో ఓ మహిళ పట్ల అసభ్యకరంగా ప్రవర్తించారు. రాయచోటి, రైల్వే కోడూరు, ఒంగోలు నియోజకవర్గాల్లో ఘర్షణలు చోటు చేసుకున్నాయి. వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి, కాంగ్రెసుకు మధ్య, వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి, తెలుగుదేశం పార్టీకి మధ్య ఘర్షణలు జరిగాయి.

ఒంగోలులో ఓ పార్టీకి ఓటేశారనే ఆరోపణపై ఇద్దరు ఉద్యోగులను తొలగించారు. గుంటూరు జిల్లా ప్రత్తిపాడు, మాచర్ల నియోజకవర్గాల్లో స్వల్ప ఘటనలు చోటు చేసుకున్నాయి. ప్రత్తిపాడు కర్నిపాడు గ్రామంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. వరంగల్ జిల్లా పరకాలలో ఓటర్లకు, పోలీసులకు మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. దీంతో ఆందోళనకారులు జీపును ధ్వంసం చేశారు.

తిరుపతి నియోజకవర్గంలో ఓటింగ్ వేగంగా ప్రారంభమై, మందకొడిగా ముగిసింది. ఈ నియోజకవర్గంలో 55 నుంచి 56 శాతం పోలింగ్ జరిగినట్లు తెలుస్తోంది. ఓ మాజీ కౌన్సలర్ డబ్బులు పంచుతుండగా పోలీసులు 80వేల రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. అనుచరులతో తిరుగుతూ హంగామా చేస్తుండడంతో పోలీసులు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకుడు చెవిరెడ్డి భాస్కర రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు.

అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గంలో ప్రశాంతంగా పోలింగ్ జరిగింది. అనంతుపురం అర్బన్‌లో కూడా పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో కొంత మంది ఓట్లు గల్లంతయ్యాయి. కడప జిల్లా ఆళ్లగడ్డ, ఎమ్మిగనూరు నియోజకవర్గాల్లో కూడా పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. పాయకరావుపేటలో అనధికారికంగా 80 శాతం పోలింగ్ జరిగినట్లు తెలుస్తోంది. తీరప్రాంత గ్రామాల్లో కాస్తా ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. అవాంఛనీయ సంఘటనలు మాత్రం చోటు చేసుకుంది. మధ్యాహ్నం తర్వాత పోలింగ్ ఊపందుకుంది. మహిళలు అత్యధికంగా ఓటింగులో పాల్గొన్నారు.

కడప జిల్లా రాయచోటి అసెంబ్లీ నియోజకవర్గంలో ఒకటి, రెండు స్వల్ప ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి, పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు లక్కిరెడ్డిపల్లి మండలంలో రెండు సంఘటనలు చోటు చేసుకున్నాయి. పరిస్థితి అదుపు తప్పుతుందని భావించి మాజీ శాసనసభ్యుడు రమేష్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రైల్వే కోడూరులో కూడా ఒకటి, రెండు సంఘటనలు చోటు చేసుకున్నాయి. కాంగ్రెసు ఎమ్మెల్సీ చెంగల్రాయుడుని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాజంపేట నియోజకవర్గంలో కూడా ప్రశాంతంగా పోలింగ్ జరిగింది.

నెల్లూరు లోకసభ ఉప ఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. ఉదయగిరి శాసనసభా నియోజకవర్గంలో అత్యధికంగా ఓట్లు నమోదయ్యాయి. సాయంత్రం ఐదు గంటల లోపు క్యాలైన్లలో నిలుచున్నవారు ఇంకా సాయంత్రం ఐదున్నర గంటల తర్వాత కూడా ఓట్లేస్తున్నారు. ఉదయగిరి శాసనసభ నియోజకవర్గం స్థానానికి ఎక్కువ ఓట్లు పోల్ కాగా, నెల్లూరు లోకసభ స్థానానికి తక్కువ ఓట్లు నమోదయ్యాయి. నెల్లూరు నగరంలో ఓట్లు తక్కువగా నమోదయ్యాయి. నెల్లూరు లోకసభ స్థానంలో భారీగా ఓట్లు గల్లంతైనట్లు అర్థమవుతోంది.

తూర్పు గోదావరి జిల్లా రామచంద్రాపురం శాసనసభా నియోజకవర్గంలో చెదురుమొదరు సంఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. నియోజకవర్గంలో పది చోట్ల తొలుత ఇవియంలు మొరాయించాయి. దీంతో వాటి స్థానంలో కొత్తవాటిని ఏర్పాటు చేశారు. ఓ చోట కొంత మంది ఓటేసిన తర్వాత ఇవియం మొరాయించింది. దీంతో కొత్త ఇవియంను ఏర్పాటు చేసి, అంతకు ముందు కూడా ఓటేసినవారిని పిలిపించి మళ్లీ ఓట్లేయించారు.

వరంగల్ జిల్లా పరకాలలో ఐదు ప్రధాన పార్టీల మధ్య పోటీ నెలకొని ఉంది. ఇక్కడ 84 శాతం పోలింగ్ జరిగినట్లు అనధికార అంచనా. చెదురుమొదరు ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. ఓటర్లు ఉత్సాహంగా ఓట్లు వేశారు. మూడు చోట్ల ఘర్షణలు చోటు చేసుకున్నాయి. సైలెంట్ ఓటింగు ఎవరికి ఉపయోగపడుతుందనేది సందేహంగా ఉంది. 2009 ఎన్నికల్లో 77.19 శాతం పోలింగ్ జరిగింది.

ఒంగోలు నియోజకవర్గంలో చివరి నిమిషంలో ఓ పోలింగ్ కేంద్రంలో ఉద్రిక్తత నెలకొంది. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అభ్యర్థి బాలినేని శ్రీనివాస రెడ్డి, తెలుగుదేశం నాయకుడు కరణం బలరాం కుమారుడు వెంకటేష్ ఒకేసారి రావడంతో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. ఇరు వర్గాల కార్యకర్తలను పోలీసులు చెదరగొట్టారు.