నిత్యానంద డ్రగ్స్ కలిపేవాడా?

నిత్యానంద డ్రగ్స్ కలిపేవాడా?

 వివాదాస్పద  నిత్యానంద స్వామి మరో న్యాయపరమైన చిక్కుల్లో ఇరుక్కున్నాడు. తమిళనాడులోని మదురై ఆధీనంలోని మతపరమైన కేంద్రంలోని పవిత్ర జలాల్లో నిత్యానంద డ్రగ్స్ కలిపేవాడని ఆరోపణలు వచ్చాయి. ఈ విషయంపై హిందూ మక్కల్ కచ్చికి చెందిన ఎం సోలైకణ్ణన్ గతంలో పోలీసులకు ఫిర్యాదు చేశారు.

భక్తులకు నిత్యానంద ఇస్తున్న పవిత్ర జలాలను పరీక్షలకు పంపించాలని ఆయన పోలీసులను కోరారు. అయితే, సోలైకణ్నన్ ఫిర్యాదును పోలీసులు స్వీకరించడానికి నిరాకరించినట్లు తెలుస్తోంది. దీంతో నిత్యానందపై, మరో ఇద్దరిపై సోలైకణ్నన్ కోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై శుక్రవారం కోర్టులో విచారణ ప్రారంభమైంది.

నిత్యానందపై, ఆయన ఇద్దరు శిష్యులపై పోలీసులు సంబంధిత సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారని ప్రభుత్వం తరఫు న్యాయవాది చెప్పారు. నిత్యానంద ఇటీవల కర్ణాటకలోని బెంగళూర్ నుంచి తమిళనాడులోని మదురైకి మారాడు. ఆయనను ఎప్పటికప్పుడు వివాదాలు చుట్టుముడుతూనే ఉన్నాయి. ఓ నటితో రాసలీలలు నడిపినట్లు ఆరోపిస్తూ బయటకు వచ్చిన వీడియోల కేసులో ఆయన 2010లో మొదటి సారి అరెస్టయ్యాడు.

ఆ కేసులో ఆయన బెయిల్‌పై విడుదలయ్యాడు. ఆ తర్వాత 2012లో జైలు ఊచలు లెక్కించాల్సి వచ్చింది. మీడియా ప్రతినిధులపై దాడి చేశారనే అభియోగాలను ఆయన ఎదుర్కున్నారు. రేప్, లైంగిక వేధింపులు వంటి ఆరోపణలు కూడా అతన్ని చుట్టుముట్టాయి. విదేశీ వనితను లైంగిక వేధించిన కేసులో నిత్యానందను అరెస్టు చేయాలని కర్ణాటక ముఖ్యమంత్రి సదానంద గౌడ ఆదేశాలు జారీ చేశారు.