చిరంజీవికి షాకిచ్చిన 'తిరుపతి'

చిరంజీవికి షాకిచ్చిన 'తిరుపతి'

 రాజ్యసభ సభ్యుడు చిరంజీవికి తిరుపతి నియోజకవర్గ ప్రజలు షాకిచ్చారు. ఉప ఎన్నికలు జరిగిన పద్దెనిమిది అసెంబ్లీ నియోజకవర్గాలలో తిరుపతి ప్రత్యేకమైనది. మిగిలిన నియోజకవర్గాలలో కాంగ్రెసు శాసనసభ్యులుగా ఉన్న వారు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ వైపు వెళ్లడంతో ఉప ఎన్నికలు జరగగా, తిరుపతిలో మాత్రం చిరంజీవి రాజ్యసభకు వెళ్లడంతో జరిగింది. దీంతో మిగిలిన నియోజకవర్గాలలోని గెలుపుకంటే తిరుపతి గెలుపే చిరంజీవికి ప్రధానం.

అయితే ఆయన గంపెడాశలు పెట్టుకున్నప్పటికీ తిరుపతి ప్రజలు మాత్రం ఆయనను కరుణించలేదు. అక్కడ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అభ్యర్థి, మాజీ టిటిడి చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఘన విజయం సాధించారు. కాంగ్రెసు పార్టీ అభ్యర్థి వెంకటరమణ ఓడిపోయారు. అయితే ఆయన రెండో స్థానంతో సరిపెట్టుకున్నారు. తిరుపతి అభివృద్ధి కోసమంటూ ఉప ఎన్నికల ముందు  హడావుడిగా చిరంజీవి చేపట్టిన కార్యక్రమాలను ప్రజలు నమ్మినట్లుగా కనిపించడం లేదు.

తాను రాజ్యసభకు వెళ్లినప్పటికీ తిరుపతి అభివృద్ధి కోసం కృషి చేస్తానని చిరంజీవి అక్కడి ప్రజలకు చెప్పారు. తాను తిరుపతిని మరిచిపోయేది లేదన్నారు. తనకు రాజకీయ జీవితం ఇచ్చిన తిరుపతిపై ప్రత్యేక దృష్టి సారిస్తానని చెప్పారు. కాంగ్రెసు పార్టీ అభ్యర్థి వెంకటరమణను గెలిపించారని సూచించారు. అయితే చిరంజీవి అభ్యర్థనను తిరుపతి ప్రజలు తిప్పి కొట్టారు. జగన్ పార్టీ అభ్యర్థికి విజయాన్ని అందించారు.

ఉప ఎన్నికల సమయంలో చిరంజీవి మిగిలిన నియోజకవర్గాల కంటే తిరుపతి పైన ప్రత్యేక దృష్టి సారించారు. పలుమార్లు తిరుపతి వెళ్లి ప్రచారంలో పాల్గొన్నారు. తాను ఐదు నియోజకవర్గాల బాధ్యత తీసుకుంటానని చిరంజీవి అధిష్టానానికి మాట ఇచ్చారు. ఆ నియోజకవర్గాలలో తిరుపతి కూడా ఉంది. అయితే రామచంద్రాపురం, నర్సాపురం నియోజకవర్గాలలో కాంగ్రెసు పార్టీ విజయం సాధించింది. ఆయన అధిష్టానానికి హామీ ఇచ్చిన నియోజకవర్గాలలో ఈ రెండు కూడా ఉన్నాయి. తిరుపతిపై ఆయనకు పరాభవం ఎదురైనప్పటికీ మిగిలిన రెండు నియోజకవర్గాలలో గెలుపు చిరంజీవికి కాస్త ఊరట అని చెప్పవచ్చు.