హెచ్‌ఆర్‌సికి చంద్రబాల ఫిర్యాదు

 హెచ్‌ఆర్‌సికి చంద్రబాల ఫిర్యాదు

తన కాల్ లిస్టును బయటపెట్టి, తనపై ఆరోపణలు చేసినందుకు వాసిరెడ్డి చంద్రబాల అనే మహిళ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌ (హెచ్ఆర్‌సి)కి ఫిర్యాదు చేశారు. వైయస్ జగన్ నాయకత్వంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీపై, సాక్షి మీడియాపై ఆమె శుక్రవారం హెచ్ఆర్‌సికి ఫిర్యాదు చేశారు. ఫ్యాక్స్ ద్వారా ఆమె హెచ్‌ఆర్‌సికి తన ఫిర్యాదును పంపించారు.

ఆమె ఫిర్యాదుపై హెచ్‌ఆర్‌సి వెంటనే ప్రతిస్పందించింది. చంద్రబాల హక్కులకు భంగం కలగకుండా చూడాలని హెచ్‌ఆర్‌సి ఆదేశించింది. ఈ వ్యవహారంపై జులై 2వ తేదీ లోగా నివేదిక సమర్పించాలని హైదరాబాదు పోలీసు కమిషనర్‌ను ఆదేశించింది. జగన్ పార్టీ కార్యర్తల నుంచి తనకు ముప్పు ఉందని ఆమె ఆరోపించారు. తనకు రక్షణ కల్పించాలని ఆమె కోరారు.

సిబిఐ జాయింట్ డైరెక్టర్ లక్ష్మినారాయణ చంద్రబాలతో ఫోన్‌లో మాట్లాడడాన్ని, చంద్రబాలు ఆంధ్రజ్యోతి మేనేజింగ్ డైరెక్టర్ వేమూరి రాధాకృష్ణతో మాట్లాడడాన్ని, చంద్రబాబు గ్రేహౌండ్స్ ఐజితో మాట్లాడడాన్ని లింక్ చేస్తూ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు తమ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్‌కు వ్యతిరేకంగా కుట్ర జరుగుతోందని ఆరోపించారు. చంద్రబాల ఫోన్లపై అనుమానాలు వ్యక్తం చేశారు.

ఈ నేపథ్యంలో వాసిరెడ్డి చంద్రబాలను ఆంధ్రజ్యోతి మేనేజింగ్ డైరెక్టర్ వేమూరి రాధాకృష్ణ స్వయంగా ఇంటర్వ్యూ చేశారు. ఈ ఇంటర్వ్యూ ఎబిఎన్ - ఆంధ్రజ్యోతి చానెల్‌లో శుక్రవారం ప్రసారమైంది. తాను లీడ్ ఇండియా కోసం పనిచేస్తున్నానని ఆమె చెప్పారు. తాను సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌ను అని ఆమె చెప్పారు. లక్ష్మినారాయణ తనకు చిన్ననాటి మిత్రుడని, తాము సహ విద్యార్థులమని ఆమె చెప్పారు. తన సేవాకార్యక్రమాలకు లక్ష్మినారాయణ సహకారం అందిస్తున్నారని ఆమె చెప్పారు. తన కార్యక్రమాల కవరేజీ కోసమే తాను మీడియావారితో మాట్లాడానని ఆమె చెప్పారు.