జగన్‌పై లగడపాటి ఫైర్

జగన్‌పై లగడపాటి ఫైర్

 వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి బెయిల్ రాజకీయం చేస్తున్నారని విజయవాడ పార్లమెంటు సభ్యుడులగడపాటి  విమర్శించారు. తల్లి వైయస్ విజయమ్మ, చెల్లి షర్మిల మాటున కొంగుచాటు రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. బెయిలు వద్దని సిబిఐ కోర్టులో లిఖితపూర్వకంగా కోరి, బయట మాత్రం అన్యాయం జరిగిపోయిందని సానూభూతి పొందే ప్రయత్నం చేస్తున్నారని దుయ్యట్టారు.

 

జగన్ సిబిఐ కోర్టుకు రాసిచ్చినట్టుగా భావిస్తున్న కాగితం జిరాక్స్ ప్రతిని విలేకరులకు అందజేశారు. ప్రజాహితపాద యాత్రలో భాగంగా మంగళవారం తిరుపతిలో ప్రచారం చేసిన సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఉప ఎన్నికల ప్రచారం కోసమైతే తనకు తాత్కాలిక బెయిలు వద్దని జగన్ సిబిఐ కోర్టుకు లిఖితపూర్వకంగా తెలిపారని, ఇస్తే పూర్తిస్థాయి బెయిల్ ఇవ్వాలని అందులో స్పష్టంగా కోరారని కానీ, బయటకు మాత్రం కనీసం ప్రచారానికి కూడా బెయిల్ ఇవ్వలేదని వాపోయారని విమర్శించారు.

ఆయన్ను జైల్లో పెట్టినట్లున్న బొమ్మను కరపత్రాలపై ముద్రించి సానుభూతి పొందాలని చూస్తున్నారని ఆరోపించారు. ఈ తప్పుడు ప్రచారంపై ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేయనున్నట్లు లగడపాటి తెలిపారు. వైయస్సార్ కాంగ్రెస్ పుట్టుకే అబద్ధాలమయమని ఆయన ధ్వజ మెత్తారు. వాన్‌పిక్ ఒప్పందంలో క్విడ్ ప్రొ కో కింద జగన్‌కు రూ.800 కోట్లు రాలేదని బైబిల్ మీద ప్రమాణం చేసి చెప్పమంటే చెప్పడానికి వైయస్ విజయమ్మకి అహం అడ్డొచ్చిందన్నారు.

కొడుకు అవినీతిపై నోరు విప్పని విజయలక్ష్మి కనీసం పార్టీ పేరు విషయంలో అయినా నిజం చెప్పాలని డిమాండ్ చేశారు. ఎలాగైనా అధికారం చేజిక్కించుకోవాలనే స్వార్థంతో చివరికి రాష్ట్ర విభజనకు కూడా జగన్ సిద్ధమయ్యాడన్నారు. ఆంధ్రరాష్ట్రాన్ని ముక్కలు చేయాలని ప్రయత్నిస్తున్న తెరాస అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర రావుతో, తెలంగాణ రాష్ట్రాన్ని సమర్థిస్తున్న భారతీయ జనతా పార్టీతో జగన్ రహస్య ఒప్పందం కుదుర్చుకున్నాడని ఆరోపించారు. ఈ ప్రమాదాన్ని గమనించి జగన్ పార్టీని మట్టి కరిపించాలని సమైక్యవాదులకు లగడపాటి సూచించారు.