ఆగని వైయస్ జగన్ పార్టీ దాడి

 ఆగని వైయస్ జగన్ పార్టీ దాడి

 సిబిఐ జాయింట్ డైరెక్టర్ (జెడి) లక్ష్మినారాయణపై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ తన దాడిని ఆపడం లేదు. తమ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్‌కు హనీ కలిగించేందుకు కుట్ర జరుగుతోందనే అనుమానాలు కలుగుతున్నాయని, తాజా సంఘటనలు ఆ అనుమానాలను మరింత పెంచుతున్నాయని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధికార ప్రతినిధి గట్టు రామచందర్ రావు శనివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు.

తమ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్‌కు వ్యతిరేకంగా జరుగుతున్న కుట్రలో లక్ష్మినారాయణ కూడా పాలు పంచుకుంటున్నారనే అనుమానం తమకు కలుగుతోందని ఆయన అన్నారు. తమ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్‌కు వ్యతిరేకంగా జరుగుతున్న కుట్రపై విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. లక్ష్మినారాయణ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని, మాన్యువల్‌ను గౌరవించడం లేదని ఆయన విమర్శించారు.

భారీ ప్రజాదరణ గల తమ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్‌ను ఓ సాధారణ ఖైదీలాగా చూస్తున్నారని ఆయన అన్నారు. జగన్ పట్ల ఓ పత్రిక నీచాతినీచంగా వ్యవహరిస్తోందని, వైయస్సార్ కాంగ్రెసు పార్టీని బద్నాం చేసేందుకు ప్రయత్నిస్తోందని ఆయన అన్నారు. జెడి లక్ష్మినారాయణ ఫోన్లు వెళ్లిన తీరు తమకు అనుమానాలు కలిగిస్తున్నాయని ఆయన అన్నారు.

అసలు విషయం బయటకు రాకుండా కొత్త విషయాలను ముందుకు తెస్తున్నారని, తాము జర్నలిస్టులను తప్పు పట్టినట్లు చిత్రీకరించే ప్రయత్నాలు చేస్తున్నారని ఆయన అన్నారు. కుట్ర బయటకు రాకుండా కొత్త కథను ముందుకు తెచ్చారని ఆయన అన్నారు. సిబిఐ జెడి  లక్ష్మినారాయణవ్యవహారంపై చర్చ జరగాలని ఆయన అన్నారు. దర్యాప్తు విషయాలను జెడి చాటుగా కొంత మందికే కాకుండా అందరికీ వివరించాలని ఆయన అన్నారు.