15 స్థానాల్లో వైయస్సార్సీపి ఫ్యాన్ హవా

 15 స్థానాల్లో వైయస్సార్సీపి ఫ్యాన్ హవా

ఉప ఎన్నికల్లో ప్రజలు జై జగన్ అన్నారు. వైయస్ జగన్ నాయకత్వంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీకిప్రజలు అత్యధిక స్థానాలు కట్టబెట్టారు. రాష్ట్రంలోని 18 శానససభా స్థానాలకు ఉప ఎన్నికలు జరుగగా, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ 15 స్థానాల్లో విజయం సాధించింది. చిరంజీవి ప్రాతినిధ్యం వహించిన తిరుపతిని వైయస్సార్ కాంగ్రెసు పార్టీయే గెలుచుకుంది. నెల్లూరు లోకసభ స్థానంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అభ్యర్థి మేకపాటి రాజమోహన్ రెడ్డి ఘన విజయం సాధించారు. అయితే, కొన్ని స్థానాల్లో మెజారిటీ స్వల్పంగా ఉండడం వైయస్సార్ కాంగ్రెసు పార్టీని కలవరపెట్టే విషయం.

పరకాలలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అభ్యర్థి కొండా సురేఖ తెరాస అభ్యర్థి బిక్షపతికి గట్టి పోటీ ఇచ్చారు. ఈ స్థానంలో కాంగ్రెసు, బిజెపిలకు డిపాజిట్లు గల్లంతయ్యాయి. కాంగ్రెసు ఐదో స్థానంలో నిలిచింది. తెలుగుదేశం పార్టీ మూడో స్థానంలో నిలిచింది. దీంతో తెలంగాణలో తెరాసకు దీటుగా తామే ఉంటామని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు దీమా వ్యక్తం చేస్తున్నారు.

వైయస్ జగన్ నాయకత్వంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నర్సన్నపేట, పాయకరావుపేట, పోలవరం, ప్రత్తిపాడు, మాచర్ల, ఒంగోలు, ఉదయగిరి, తిరుపతి, అనంతపురం అర్బన్, రాయదుర్గం, ఎమ్మిగనూరు, ఆళ్లగడ్డ, రాజంపేట, రాయచోటి, రైల్వే కోడూరు, తిరుపతి స్థానాల్లో విజయం సాధించింది. కాంగ్రెసు పార్టీ అభ్యర్థి కొత్తపల్లి సుబ్బారాయుడు, రామచంద్రాపురంలో కాంగ్రెసు అభ్యర్థి తోట త్రిమూర్తులు విజయం సాధించారు. పరకాలలో తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) విజయం సాధించింది. తెలుగుదేశం పార్టీ మాచర్ల, ప్రత్తిపాడు, ఒంగోలు వంటి స్థానాల్లో గట్టి పోటీనే ఇచ్చింది. మాచర్ల, ప్రత్తిపాడుల్లో కాంగ్రెసు పార్టీ డిపాజిట్లు కోల్పోయింది. అయితే, ప్రకాశం, గుంటూరు జిల్లాలు తెలుగుదేశం పార్టీకి బలమైనవి.

రామచంద్రాపురం, తిరుపతి, ఉదయగిరి, నరసన్నపేట వంటి స్థానాల్లో కాంగ్రెసు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీల మధ్య ఉత్కంఠ పోరు జరిగింది. తిరుపతిలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అభ్యర్థి భూమన కరుణాకర్ రెడ్డి, కాంగ్రెసు అభ్యర్థి వెంకటరమణకు మధ్య నువ్వా నేనా అన్నట్లు పోటీ నెలకొన్నా భూమన కరుణాకర్ రెడ్డి బయటపడే అవకాశాలున్నాయి. రామచంద్రాపురంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అభ్యర్థి పిల్లి సుభాష్ చంద్రబోస్ తొలుత కాంగ్రెసు అభ్యర్థి తోట త్రిమూర్తులపై ఆధిక్యం సాధించారు. అయితే తర్వాత తోట త్రిమూర్తులు పుంజుకుని విజయం సాధించారు.

తెలంగాణలోని పరకాల స్థానాన్ని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అభ్యర్థి బిక్షపతి దక్కించుకున్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అభ్యర్థి కొండా సురేఖ రెండో స్థానంలో నిలిచారు. తెలుగుదేశం పార్టీ మూడో స్థానంలో నిలిచింది. తెరాసకు సవాల్ విసిరి మహబూబ్‌నగర్ ఫలితాన్ని పరకాలలో పునరావృతం చేస్తామని పోటీకి దిగిన బిజెపికి పరాభవం తప్పలేదు.

ప్రస్తుత ఫలితాలతో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ, తెరాస శాసనసభలో తమ బలాలను పెంచుకున్నాయి. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ బలం రెండు నుంచి 17కు పెరిగింది. ఇంతకు ముందు వైయస్సార్ కాంగ్రెసు నుంచి వైయస్ విజయమ్మ, నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి శాసనసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. తెరాస బలం 16 నుంచి 17కు పెరిగింది. ఓ అనుబంధ సభ్యుడు కూడా తెరాసకు ఉన్నాడు.

ఈ నెల 12వ తేదీన ఉప ఎన్నికల పోలింగ్ జరిగింది. శుక్రవారం ఉదయం ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. 18 శాసనసభా నియోజకవర్గాలకు, ఓ లోకసభ స్థానానికి ఉప ఎన్నికలు జరిగాయి. ఈ ఉప ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధిక స్థానాలు గెలుస్తుందనే అంచనాలు నిజమయ్యాయి.

18 స్థానాల్లో గెలిచిన అభ్యర్థులు:

1. నర్సన్నపేట - ధర్మాన కృ-ష్ణదాస్ (వైయస్సార్సీపి), 2. పాయకరావుపేట - గొల్ల బాబూరావు (వైయస్సార్పీ), 3. రామచంద్రాపురం - తోట త్రిమూర్తులు (కాంగ్రెసు), 4. నర్సాపురం - కొత్తపల్లి సుబ్బారాయుడు (కాంగ్రెసు), 5. పోలవరం - తెల్లం బాలరాజు (వైయస్సార్సిపీ), 6. ప్రత్తిపాడు - మేకతోటి సుచరిత (వైయస్సార్సీపి), 7. మాచర్ల - పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి (వైయస్సార్సిపీ), 8. ఒంగోలు - బాలినేని శ్రీనివాస రెడ్డి (వైయస్సార్పీపి), 9. ఉదయగిరి - మేకపాటి చంద్రశేఖర రెడ్డి (వైయస్సార్సిపీ),  10. తిరుపతి - భూమన కరుణాకర్ రెడ్డి (వైయస్సార్సిపీ), 11. అనంతపురం - గుర్నాథ్ రెడ్డి (వైయస్సార్సిపీ), 12. రాయదుర్గం - కాపు రామచంద్రా రెడ్డి (వైయస్సార్సీపి), 13. ఎమ్మిగనూరు - ఎర్రకోట చెన్నకేశవ రెడ్డి (వైయస్సార్సిపీ), 14. ఆళ్లగడ్డ - శోభానాగి రెడ్డి (వైయస్సార్పిపి), 15. రాజంపేట - ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి, 16. రాయచోటి - గండికోట శ్రీకాంత్ రెడ్డి (వైయస్సార్సిపీ), 17. రైల్వే కోడూరు - శ్రీనివాసులు (వైయస్సార్సిపీ), 18 పరకాల - బిక్షపతి (తెరాస)

నెల్లూరు లోకసభ స్థానంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అభ్యర్థి మేకపాటి రాజమోహన్ రెడ్డి విజయం సాధించారు.