ఎమ్మెల్యేలతో జగన్ మైండ్ గేమ్

ఎమ్మెల్యేలతో జగన్ మైండ్ గేమ్

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు  వైయస్ జగన్మోహన్ రెడ్డి  కొంతమంది ఎమ్మెల్యేలతో మైండ్ గేమ్ ఆడుతున్నట్లుగా కనిపిస్తోందని అంటున్నారు. కాంగ్రెసు పార్టీ తనను ఉద్దేశ్యపూర్వకంగా దెబ్బతీసేందుకు జైలుకు పంపించిందని భావిస్తున్న జగన్.. కాంగ్రెసు పార్టీని దెబ్బతీసేందుకు తనకు అనుకూలంగా ఉంటున్న కొందరు ఎమ్మెల్యేలతో కాంగ్రెసు ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయాలని చూస్తున్నారని అంటున్నారు.

ఇతర పార్టీల ఎమ్మెల్యేలను ఆకర్షించడానికి అప్పట్లో దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి ఆపరేషన్ ఆకర్ష్ ఉపయోగిస్తే జగన్ మాత్రం ఇప్పుడు ఆపరేషన్ రొటేషన్ చూపిస్తున్నారని అంటున్నారు. వాపును బలంగా చూపేందుకు గుప్పెడు ఎమ్మెల్యేలతో మూడేళ్లుగా జగన్ ఆడుతున్న జగన్నాటకమాడుతున్నారని అంటున్నారు. మూడు పదుల ఎమ్మెల్యేలతోనే మూడేళ్లుగా జగన్ మైండ్‌గేమ్ ఆడుతున్నారని, ఆయనకు మద్దతు ఇస్తున్న ఎమ్మెల్యేలు మధ్యలో సొంత గూటికి వెళుతున్నారని అంటున్నారు.

మూడు పదుల ఎమ్మెల్యేలతోనే మూడేళ్లుగా జగన్ మైండ్‌గేమ్ ఆడుతున్నారని, ఆయనకు మద్దతు ఇస్తున్న ఎమ్మెల్యేలు మధ్యలో సొంత గూటికి వెళతారని, జగన్ కష్టాల్లో ఉన్నారని భావించినప్పుడు.. వారే తిరిగి జగన్ గూటికి చేరుతుంటారని అంటున్నారు. ఇదంతా వ్యూహాత్మకంగా జరుగుతుందని అనుమానిస్తున్నారు. ఆయనకు మద్దతు ఇచ్చే ఎమ్మెల్యేల సంఖ్య పెరగదు. కానీ, రొటేషన్ పద్ధతిలో వారినే మళ్లీ మళ్లీ తెరపైకి తీసుకు రావడంతో ఆయనకు ఎంతోమంది ఎమ్మెల్యేలు మద్దతు ఇస్తున్నారన్న భ్రమ కల్పిస్తున్నట్లుగా కనిపిస్తోందన్నారు.

రెండు, మూడేళ్లుగా ఆయన ఈ ఎత్తుగడనే విజయవంతంగా ప్రయోగిస్తున్నారని అంటున్నారు. తాజాగా, అక్రమ ఆస్తుల కేసులో అరెస్టయిన తర్వాత కూడా తన, తన పార్టీ గ్రాఫ్ ఏమాత్రం పడిపోలేదని చెప్పుకొనేందుకు అదే ఎత్తుగడకు మరోసారి పదును పెట్టారని అంటున్నారు. కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి, బొబ్బిలి ఎమ్మెల్యే సుజయ కృష్ణ రంగారావు, పార్వతీపురం ఎమ్మెల్యే జయమణి తాజాగా జగన్ పార్టీకి జైకొట్టడం ఈ మైండ్ గేమ్‌లో భాగమే అంటున్నారు. రోశయ్య స్థానంలో కిరణ్ కుమార్ రెడ్డికి ముఖ్యమంత్రి బాధ్యతలు అప్పగించినప్పుడు కూడా తనకు మద్దతు ఇచ్చే ఎమ్మెల్యేలతో పరేడ్ చేయించాలని జగన్ భావించారు.

అప్పట్లో ఆయన వెంట చాలామంది వెళ్లిపోతారన్న ఊహాగానాలు వెల్లువెత్తాయి. కానీ, ఆయనకు మద్దతు ఇచ్చే వారి సంఖ్య మూడు పదులను దాటలేదు. అలాగే, సొంత పార్టీని పెట్టిన తర్వాత విజయవాడలో జగన్ జరిపిన లక్ష్యదీక్షకు 27 మంది ఎమ్మెల్యేలు హాజరైన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఢిల్లీలో జరిగిన దీక్షకు 32 మంది ప్రజా ప్రతినిధులు మద్దతు తెలిపారు. వీరిలో ప్రతిపక్ష టిడిపికి చెందినవారు ఇద్దరుండగా.. మిగిలిన వారంతా అధికార పార్టీ ఎమ్మెల్యేలే. దీంతో అధికార పార్టీ నుంచి జగన్ పార్టీకి వలసలు పెరిగిపోతున్నాయని, ఇక ప్రభుత్వం కుప్పకూలడం ఖాయమంటూ అప్పట్లో ఊహాగానాలూ వెల్లువెత్తాయి.

అవిశ్వాస తీర్మానం పెడితే తడాఖా చూపిస్తామంటూ జగన్ పార్టీ సవాల్ కూడా చేసింది. దీంతో శాసనసభలో టిడిపి అవిశ్వాస తీర్మానాన్ని పెట్టింది. కానీ, అప్పట్లో ఆ తీర్మానానికి జగన్ పార్టీ నుంచి మద్దతు తెలిపిన వారి సంఖ్య కేవలం 17. మిగిలినవారంతా సొంతగూటికి వెళ్లిపోయారు. వారిలో ఆళ్ల నాని, ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి, సి.ఆదినారాయణ రెడ్డి, నల్లమిల్లి శేషారెడ్డి, కమలమ్మ, కుంజా సత్యవతి తదితరులు ఉన్నారు. అప్పటి నుంచి వారంతా కాంగ్రెస్‌లోనే కొనసాగుతున్నారు. దీని వెనక రకరకాల కారణాలూ వినిపిస్తున్నాయి.

తాజాగా, అక్రమ ఆస్తుల కేసులో జగన్ జైలుకు వెళ్లడం ఖాయమన్న నిర్ణయానికి ఆ పార్టీ నేతలు వచ్చారు. అదే సమయంలో రాష్ట్రంలో ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. రాష్ట్రంలోని పలు నియోజకవర్గాల్లో జగన్ పార్టీకి బలమైన కేడర్ లేదు. సానుభూతినే ప్రధాన అస్త్రంగా చేసుకుని ఆ పార్టీ ముందుకు సాగుతోంది. ఉప ఎన్నికల సమయంలోనే అరెస్టు జరిగితే.. అది పార్టీ శ్రేణులపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఎన్నికల ఫలితాలపైనా ప్రభావం తప్పదు.

ఈ నేపథ్యంలోనే జగన్ ఆపరేషన్ ఆకర్ష్‌కు మరోసారి పదును పెట్టారని అంటున్నారు. గతంలో తనకు మద్దతు ఇచ్చిన వారు, తన వలలో పడతారని భావించిన ఆయన, సుమారు 30 మందితో నెల రోజులుగా మంతనాలు జరిపారు. ఎట్టకేలకు ఇప్పటివరకూ ఆయనతో టచ్‌లో ఉన్నవారు సహా నలుగురు జగన్ వలకు చిక్కినట్లు రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. వాస్తవానికి, జగన్ క్యాంపు నుంచి దూరమైనట్లు ప్రకటించినా ఏలూరు ఎమ్మెల్యే నాని ఎప్పటికప్పుడు ఆయనతో టచ్‌లోనే ఉంటున్నారని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు.

కాంగ్రెస్‌లో కొనసాగుతున్నందుకు పార్టీ ముఖ్య నేతలు ఇస్తోన్న ప్రాధాన్యంతో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేయించుకోవాలని, అవసరమైనప్పుడు జగన్ గూటికి ఎగిరిపోవాలని నాని ఎప్పుడో నిర్ణయించుకున్నారని వివరిస్తున్నారు. కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి కూడా ఇదే వైఖరితో ఉన్నారని చెబుతున్నారు. జగన్ గూటి నుంచి బయటకు వచ్చిన తర్వాత కాంగ్రెస్‌లో హడావుడి చేసిన చంద్రశేఖర రెడ్డి సిఎం కిరణ్‌తో సఖ్యతను ప్రదర్శిస్తూ వచ్చారు.

తూర్పు గోదావరి జిల్లాలో మంత్రులకు తెలియకుండా ముఖ్యమంత్రి పర్యటనకు రూట్ మ్యాప్ కూడా ఆయనే తయారు చేసేవారని.. అదే సమయంలో ఎప్పటికప్పుడు జగన్‌తో టచ్‌లో ఉండేవారని పార్టీ నేతలు వివరిస్తున్నారు. ఇక, బొబ్బిలి ఎమ్మెల్యే సుజయ్ కృష్ణ రంగారావు, పార్వతీపురం ఎమ్మెల్యే జయమణి, కురుపాం ఎమ్మెల్యే జనార్దన్ కూడా గతంలో జగన్ శిబిరంలో ఉన్నవారే. తన అరెస్టు నేపథ్యంలో వారినే జగన్ మళ్లీ తెరపైకి తీసుకొచ్చారు.

సిబిఐ విచారణకు వెళ్లిన సమయంలో జగన్ వెంట ఆళ్ల నాని వెళ్లిన సంగతి తెలిసిందే. తాజాగా కాంగ్రెస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్లు ఆళ్ల నాని గురువారం మధ్యాహ్నం ప్రకటించారు. జగన్ పక్షాన నిలుస్తున్నట్లు స్పష్టం చేశారు. జగన్ అరెస్టైన తర్వాత సుజయ్ రంగారావు ఆయనకు జైకొట్టారు. పార్టీకి, శాసన సభ్యత్వానికీ రాజీనామా చేస్తున్నానని ప్రకటించారు. అయితే ఇప్పటివరకూ ఆయన లేఖ స్పీకర్ కార్యాలయానికి చేరలేదు.

ఇక మంత్రి శత్రుచర్లకు బంధువైన జనార్దన్ ఇప్పటికిప్పుడు పార్టీని వీడే అవకాశాలు కనిపించడం లేదని ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. ఈ విషయమై ఇటీవల మంత్రి శత్రుచర్లతో సిఎం కిరణ్ మాట్లాడారు కూడా. ఇక కష్టాల్లో ఉన్నప్పుడు స్నేహితునిగా జగన్‌కు సంఘీభావం తెలపాల్సిన బాధ్యత ఉందని ద్వారంపూడి చెబుతున్నారు. ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా విశాఖపట్నం జిల్లాలో పర్యటిస్తున్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు విజయలక్ష్మిని గురువారం మధ్యాహ్నం చంద్రశేఖర రెడ్డి, సుజయ్ రంగారావు, జయమణి కలిశారు.

వ్యానులోనే ఆమెతో సమావేశమయ్యారు. అనంతరం వారు విలేకరులతో మాట్లాడుతూ, జగన్‌ను జైలుకు పంపిన వైనాన్ని వ్యతిరేకిస్తూ వైఎస్ కుటుంబంపై అభిమానంతో విజయలక్ష్మిని కలిసి సంఘీభావం తెలిపామని ప్రకటించారు. తన నిర్ణయాన్ని రెండు రోజుల్లో చెబుతానని ద్వారంపూడి ప్రకటించారు. ఇక కృష్ణా జిల్లా నూజివీడు టిడిపి ఎమ్మెల్యే రామకోటయ్య కూడా జగన్ పార్టీ బాట పట్టనున్నారని తెలుస్తోంది. ఇందులో భాగంగానే 2014లో పార్టీ టికెట్ అడగనని, ఇచ్చినా తీసుకోనని వ్యాఖ్యానించారని చెబుతున్నారు.