ముగిసిన జగన్ కస్టడీ

ముగిసిన జగన్ కస్టడీ

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి సిబిఐ కస్టడీ ఆదివారంతో ముగిసింది. ఆదివారం ఉదయం పదిన్నర గంటలకు జగన్‌ను సిబిఐ చంచల్‌గూడ జైలు నుండి తమ కస్టడీకి తీసుకుంది. అనంతరం అక్కడ నుండి కోఠిలోని సిబిఐ కార్యాలయానికి తరలించింది. ఆరున్నర గంటల పాటు జగన్‌ను సిబిఐ విచారించింది. అనంతరం సాయంత్రం ఐదు గంటలకు సిబిఐ కార్యాలయం నుండి చంచల్‌గూడ జైలుకు తరలించారు. జగన్‌ను సిబిఐ ఏడు రోజుల పాటు తమ కస్టడీకి తీసుకొని విచారించింది.

మారిషస్, లక్సెంబర్గ్ దేశాలతో పాటు మరో నాలుగు దేశాల నుండి జగన్ కంపెనీలలోకి వచ్చిన పెట్టుబడులపై సిబిఐ జగన్‌ను విచారించినట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే విదేశీ పెట్టుబడులపై లెటర్ ఆఫ్ రెగోరేటరీకి సిబిఐ లేఖ రాసింది. కంపెనీలో పెట్టుబడులపై పూర్తి స్థాయిలో ఆయనను ప్రశ్నించింది. విదేశీ పెట్టుబడులతో పాటు ముంబై, కోల్‌కతా కంపెనీల పెట్టుబడులపై కూడా సిబిఐ జగన్ నుండి ఆరా తీసినట్లుగా తెలుస్తోంది.

తొలుత ఐదు రోజుల పాటు జగన్‌ను విచారించిన సిబిఐ అధికారులు ఆ తర్వాత మరో రెండు రోజులు తమ కస్టడీకి అప్పగించాలని కోర్టును కోరారు. ఐదు రోజుల తమ విచారణలో జగన్ ఏమీ చెప్పడం లేదని, తనకు ఏమీ తెలియదని, అంతా జగతి పబ్లికేషన్స్ వైస్ చైర్మన్ విజయ సాయి రెడ్డికే తెలుసునని చెబుతున్నారని, ఈ నేపథ్యంలో ఆయన నుండి ఈ ఐదు రోజుల పాటు సేకరించిన వివరాలు మరింత పూర్తిగా తెలియాలంటే మరో రెండు రోజులు తమ కస్టడీకి అప్పగించాలని కోరారు. దీంతో కోర్టు జగన్‌ను రెండోసారి సిబిఐ కస్టడీకి అనుమతించింది.

ఈ వారం రోజులలో సిబిఐ అధికారులు జగన్‌తో పాటు విజయ సాయి రెడ్డి, ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి తదితరులను కూడా విచారించారు. ప్రతి ఉదయం పదిన్నర గంటలకు జగన్‌ను చంచల్ గూడ జైలు నుండి తమ కస్టడీకి తీసుకున్న సిబిఐ సాయంత్రం ఐదు గంటలకు అతనిని జైలుకు తరలించింది. తొలిరోజు జైళ్లశాఖ డిజి కార్యాలయంలో ప్రశ్నించిన సిబిఐ ఆ తర్వాత ఆరు రోజులు కోఠిలోని కార్యాలయంలోనే ప్రశ్నించింది.