చిరంజీవి గెలిచినచోట షర్మిల గళం

చిరంజీవి గెలిచినచోట షర్మిల గళం

 రాజ్యసభ సభ్యుడు చిరంజీవి గత నియోజకవర్గం తిరుపతిలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి షర్మిల విపక్షాలపై తీవ్రస్థాయిలో విరుచుకు పడ్డారు. ఆదివారం ఆమె తన తల్లి, పులివెందుల శాసనసభ్యురాలు వైయస్ విజయమ్మతో కలిసి తిరుపతి ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి మంచి మనసు అందరికీ తెలుసు అన్నారు.

ఆయన అనుక్షణం ప్రజాహితం కోసం తపించారన్నారు. తన సోదరుడు వైయస్ జగన్‌ను తలుచుకుంటే మనసు తల్లడిల్లి పోతోందని.. ఒక్కడి పైన ఇంతమంది ఇన్ని కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. దేవుడు అనే వాడు ఉన్నాడని జగన్‌ను బయటకు తీసుకు వస్తాడని, ముఖ్యమంత్రిని కూడా చేస్తాడని పునరుద్ఘాటించారు. ఈ నెల 12న ఉప ఎన్నికలు జరుగుతున్నాయని, దేశమంతా వీటిని చూస్తోందని.. జగన్ భవిష్యత్తు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ భవిష్యత్తు ఏమవుతోందా అని చూస్తోందని అన్నారు.

హెలికాప్టర్‌ను కూల్చి, మంచి మనిషిని జైల్లో పెట్టిన ఈ కుళ్లు రాజకీయాలకు స్వస్థీ చెప్పాలన్నారు. విలువలకు పెద్ద పీట వేయాలని, మంచి రాజకీయ నాయకులను తీసుకు రావాలన్నారు. దేశవ్యాప్తంగా చూస్తున్న ఈ ఎన్నికలలో వైయస్సార్ కాంగ్రెసును అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరారు. రాజన్న రాజ్యం రావాలంటే మాట తప్పని.. మడమ తిప్పని జగన్ ముఖ్యమంత్రి కావాలన్నారు. ఎంతోమంది పదవుల కోసం వైయస్ కుటుంబంతో సంబంధం లేనట్లుగా ఉన్నారని, కానీ భూమన కరుణాకర్ రెడ్డి మాత్రం జగన్‌కు అండగా నిలుచున్నారన్నారు.

ఆయనకు మద్దతుగా అందరూ నిలబడాలన్నారు. ఘన విజయం ఆయనకు చేకూర్చాలన్నారు. రాజ్యసభ సభ్యుడు చిరంజీవి, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గెలుపు కోసం కోట్లు పంచుతున్నారని అంటున్నారని, కానీ విలువలకు మానవత్వానికి మీరు అండగా నిలబడి జగన్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఆత్మప్రభోదానుసారం ఓటు వేయాలని సూచించారు.

ఈ ఉప ఎన్నికలకు ఇదే ఆఖరు సమావేశమని, జగన్ మీ వద్దకు రాకుండా కుట్రతో జైలు పాలు చేశారని ఆరోపించారు. ఆయన తరఫున న్యాయం కోసం అమ్మ, తాను మీ వద్దకు వచ్చామన్నారు. ఇంతమంది కుట్రదారుల మధ్య మా ధైర్యే మీరు ఒక్కటే అన్నారు. మీ అండ మాకు ఉందనే, మీ దీవెనలు మాకు ఉన్నాయన్నారు. ఉప ఎన్నికలలో మీరిచ్చే తీర్పు చరిత్ర సృష్టిస్తుందని, వైయస్ ఆశయాలను జగన్ నెరవేరుస్తాడన్నారు.