చంద్రబాబుకు జగన్ పార్టీ సవాల్

చంద్రబాబుకు జగన్ పార్టీ సవాల్

కోలా కృష్ణమోహన్ వ్యాఖ్యలపై తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేతలు జూపూడి ప్రభాకర రావు, అంబటి రాంబాబు సవాల్ విసిరారు. కోలా చేసిన ఆరోపణలకు సంబంధించి బాబు తన నిజాయితీ నిరూపించుకోవాలని జూపూడి హైదరాబాదులో విలేకరుల సమావేశంలో డిమాండ్ చేశారు. సిబిఐ, ఈడి విచారణకు సిద్ధపడారన్నారు. ఖాతాల నెంబర్లతో సహా కోలా బయటపెట్టినప్పటికీ చంద్రబాబు విదేశీ బ్యాంకు ఖాతాల గురించి కాంగ్రెసు నేతలు ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు.

సింగపూరులో ఉన్న బ్యాంకు పేరు, ఖాతా నెంబరు కూడా కోలా ఇచ్చారన్నారు. చంద్రబాబు ఇక్కడ దోచుకుని విదేశీ బ్యాంకులలో దాచుకున్న విషయాన్ని ఈ రోజు కోలా బయట పెట్టాడన్నారు. బాబు కుటుంబంలో ఒక వ్యక్తిగా ఉన్న కోలా ఆయన వ్యవహారం, వారి అబ్బాయి బాగోతాలు బయటపెట్టారన్నారు. కోలా ఆరోపణలకు బాబు సమాధానం చెప్పాలన్నారు. బాబు అవినీతిపై తమ పార్టీ నేత విజయమ్మ దాఖలు చేసిన పిటిషన్‌ని విచారణకు రాకుండా నిలుపుదల చేసుకున్నారన్నారు.

అతని విదేశీ ఖాతాల పైన ఈడి విచారించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలు పోటీ పడి ఈ రోజు ఉప ఎన్నికలలో డబ్బు పంచుతున్నాయని విమర్శించారు. ఆ డబ్బు ఎక్కడి నుండి వచ్చిందని ప్రశ్నించారు. టిడిపి వారు ఓటరుకు వెయ్యి రూపాయలు కాంగ్రెసు రూ.500 పంచుతోందన్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ వారు డబ్బులు పంచడం లేదని, ఆ విషయం ప్రజలు అడిగే పరిస్థితి తెచ్చారన్నారు. బాబు దగ్గర బ్లాక్ మనీ ఎంతుందన్నారు.

కోలా ఆరోపణలపై చంద్రబాబు విచారణకు అంగీకరిస్తే బాబు అవినీతి బయటకు వస్తుందని అంబటి రాంబాబు చిత్తూరు జిల్లాలో అన్నారు. కోలా చెప్పిన అకౌంట్లు తనవి కావని చంద్రబాబు అంగీకరించగలడా అని ప్రశ్నించారు. కోలా ఆరోపణలపై బాబు విచారణకు ఆమోదించాలని, ఇందుకు సిద్ధమని చెబుతూ ఆయన ప్రభుత్వానికి లేఖ రాయాలని డిమాండ్ చేశారు. కోలా పూర్తి ఆధారాలతో పాటు అకౌంట్ల నెంబర్లను కూడా చెప్పినందున ఆయన మాటలు నమ్మాల్సి వస్తుందన్నారు.