మేకపాటికి సానుభూతి కలిసి వస్తుందా?

 మేకపాటికి సానుభూతి కలిసి వస్తుందా?

నెల్లూరు జిల్లా ఉదయగిరి శానససభా స్థానంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అభ్యర్థి  మేకపాటి చంద్రశేఖర రెడ్డి సానుభూతి  ఓటుతో గట్టెక్కే అవకాశాలున్నట్లు అంచనా. ఉదయగిరి శానససభా నియోజకవర్గం ఓటర్లు రెండు ఓట్లు వేయనున్నారు. ఒక్కటి పార్లమెంటుకు, మరోటి శాసనసభకు. నెల్లూరు లోకసభ స్థానానికి కూడా ఉప ఎన్నిక జరుగుతుండడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. ఉదయగిరిలో మాజీ ఎమ్మెల్యే కంభం విజయరామిరెడ్డి కాంగ్రెస్ తరపున పోటీ చేస్తున్నారు. తెలుగుదేశం నుంచి ప్రముఖ పారిశ్రామికవేత్త, రాజకీయాల్లో కొత్తముఖమైన బొల్లినేని రామారావు రంగంలో ఉన్నారు.

 

మూడు ప్రధాన పార్టీల అభ్యర్థుల మధ్య హోరాహోరి పోరే సాగుతోంది. నెల్లూరు జిల్లాలోనే పూర్తిగా వెనుకబడిన నియోజకవర్గంగా పేరొందిన ఉదయగిరి నియోజకవర్గం ఎనిమిది మండలాల పరిధిలో విస్తరించి ఉంది. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అభ్యర్థి మేకపాటి చంద్రశేఖర రెడ్డికి కలిసి వస్తుందని అంచనా వేస్తునారు. మహిళల్లో ఇది ఎక్కువగా పని చేసే అవకాశాలున్నట్లు చెబుతున్నారు జగన్ అరెస్టు తర్వాత ఈ పరిస్థితి ఎక్కువైనట్లు విశ్లేషిస్తున్నారు.

వైయస్ విజయమ్మ, షర్మిల ప్రచారపర్వం పూర్తయితే మరింత ఊపువస్తుందనే అంశాన్ని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అభ్యర్థి చంద్రశేఖరరెడ్డి పరంగా చూస్తే నియోజకవర్గ పరిధిలో వ్యతిరేకత ఎక్కువే. గత రెండు పర్యాయాలుగా ఆయనను కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఓటర్లు గెలిపించినా అందుబాటులో లేరని, సమస్యల పరిష్కారం పట్ల శ్రద్ధచూపడనే విమర్శలున్నాయి. ఈ వ్యతిరేకత అంతా జగన్ సానుభూతి వెల్లువలో కొట్టుకుపోయి విజయావకాశాలకు బాటలు వేస్తాయనే ధీమా వ్యక్తమవుతోంది. అంతేగాక ఈయన సోదరుడు మేకపాటి రాజమోహనరెడ్డి నెల్లూరు లోక్‌సభ స్థానం ఉప ఎన్నికల్లో ఇదే పార్టీ తరపున పోటీ చేస్తుండటం వల్ల కలిసి వస్తుందని కూడా అంటున్నారు.

కాంగ్రెస్‌ అభ్యర్థి కంభం విజయరామిరెడ్డి గత రెండున్నర దశాబ్దాల పైబడి ఆయన తెలుగుదేశం నేతగా నియోజకవర్గ ప్రజానీకానికి సుపరచితుడు. తనకు ప్రాధాన్యత తగ్గుతోందని భావించి ఆయన తెలుగుదేశం పార్టీకి దూరమయ్యారు. మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి చొరవతో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. కంభం కాంగ్రెస్‌లో చేరినా ఆయన అనుచరులు మాత్రం తెలుగుదేశంలోనే కొనసాగుతున్నారు. అధికార పార్టీలో కొనసాగడాన్ని కంభం అనుకూలంగా మార్చుకుంటున్నారు.

నెల్లూరు లోకసభ స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో నిలిచిన టి సుబ్బరామిరెడ్డి దిగడం తనకు అనుకూలంగా మారిందని కంభం భావిస్తున్నారు. ఉదయగిరి నియోజకవర్గంలో మేకపాటి సోదరులతో దీటుగా తలపడే సత్తా ఉన్నది కంభం విజయరామిరెడ్డికి మాత్రమేనని అంటారు. గత మూడు అసెంబ్లీ ఎన్నికల్లోనూ మేకపాటి, కంభం మధ్యనే పోటీ జరిగింది.

తెలుగుదేశం అభ్యర్థి బొల్లినేని రామారావు ఉదయగిరి వర్గపోరులో బొల్లినేని దీటైన నాయకుడు కాదనే వాదనలున్నాయి. అయినాసరే అనుకూలించే అంశాలు కూడా మెండుగానే ఉన్నాయని చెబుతున్నారు. నియోజకవర్గ పరిధిలో బొల్లినేని సామాజికవర్గమైన కమ్మ జనాభా ప్రాబల్యం అధికం. సుమారు 32వేలకుపైగానే ఓట్లు ఉన్నాయి. అంతేగాక కాంగ్రెస్, వైఎయస్సార్ తరపున పోటీ చేస్తున్న ఇద్దరి మధ్య రెడ్డి సామాజిక వర్గం ఓట్లు చీల తనకు లాభిస్తుందని బొల్లినేని రామారావు భావిస్తున్నారు. ఏమైనా, మేకపాటి చంద్రశేఖర రెడ్డి మాత్రం తీవ్రమైన పోటీనే ఎదుర్కుంటున్నారు.