జగన్ వామనావతారం: వైయస్ వివేకా

జగన్ వామనావతారం: వైయస్ వివేకా

తమ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి వామనావతారంలో కాంగ్రెసు రాక్షస సంహారం చేసి ధర్మాన్ని కాపాడుతారని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకుడు, మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి  అన్నారు. ఉప ఎన్నికల్లో ప్రజా స్పందన చూస్తుంటే కాంగ్రెసుకు ఇవే చివరి ఎన్నికలని అనిపిస్తోందని ఆయన శుక్రవారం కడప జిల్లాలో అన్నారు. ఉప ఎన్నికల తర్వాత మధ్యంతర ఎన్నికలు ఎప్పుడైనా రావచ్చునని ఆయన అన్నారు. 

గనుల అక్రమ తవ్వకాల కేసులో ఆరోపణలు ఎదుర్కుంటున్న కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి వ్యవహారాన్ని తమ పార్టీ అధ్యక్షుడు  వైయస్ జగన్మోహన్ రెడ్డి కి ముడిపెట్టడం దారుణమని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత గట్టు రామచందర్ రావు అన్నారు. న్యాయవ్యవస్థను భ్రష్టు పట్టించింది తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడేనని ఆయన శుక్రవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో హైదరాబాదులో అన్నారు. 

చంద్రబాబు తన హయాంలో న్యాయవ్యవస్థను మేనేజ్ చేసేవారని, ఆ విషయాన్ని బ్రిటిష్ సంస్థ అప్పట్లోనే చెప్పిందని ఆయన అన్నారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన లక్ష్మణన్ తమిళనాడులోని సొంతూరులో గల గుడికి చంద్రబాబు పది లక్షల రూపాయల విరాళం ఇచ్చారని ఆయన చెప్పారు. చంద్రబాబు జరిపిన కేటాయింపులపై విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని ఓ దినపత్రిక కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలకు కరపత్రంగా మారిందని ఆయన విమర్శించారు.

ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు ఇప్పటికైనా మారాలని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకురాలు శోభా నాగిరెడ్డి కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో అన్నారు. విజయమ్మకు వస్తున్న ప్రజాదరణను చూసి కాంగ్రెసు, తెలుగుదేశం నాయకులు మతి తప్పి మాట్లాడుతున్నారని ఆమె అన్నారు.