అవమానం, జైల్లో ఆమరణ దీక్ష

అవమానం, జైల్లో ఆమరణ దీక్ష

 వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని పోలీసులు చంచల్‌గూడ జైలు నుండి నాంపల్లిలోని ప్రత్యేక కోర్టుకు తరలించారు. ఆదివారంతో వైయస్ జగన్మోహన్ రెడ్డి సిబిఐ కస్టడీ ముగిసిన విషయం తెలిసిందే. గత నెల 28న కోర్టు జగన్‌కు ఈ నెల 11వ తేది వరకు జ్యూడిషియల్ రిమాండు విధిస్తూ తీర్పు చెప్పింది. ఆ తర్వాత సిబిఐ పిటిషన్ మేరకు వారం రోజుల పాటు కస్టడీకి అప్పగించింది.

కస్టడీ, జ్యూడిషియల్ రిమాండ్ ముగియడంతో పోలీసులు జగన్‌ను ప్రత్యేక కోర్టులో హాజరుపర్చారు. వైయస్ జగన్‌ను కలిసేందుకు ఆయన తల్లి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవ అధ్యక్షురాలు, పులివెందుల శాసనసభ్యురాలు వైయస్ విజయమ్మ, సోదరి షర్మిల, భార్య భారతి ప్రత్యేక కోర్టుకు వచ్చారు. వారు పబ్లిక్ ప్రాసిక్యూటర్ గదిలో జగన్‌తో కాసేపు మాట్లాడారు. అనంతరం పోలీసులు జగన్‌ను కోర్టులో హాజరుపర్చారు.

జగన్‌తో పాటు జగతి పబ్లికేషన్స్ వైస్ చైర్మన్ విజయ సాయి రెడ్డి, అయోధ్య రామిరెడ్డి, వెంకట్రామి రెడ్డిలను కూడా పోలీసులు కోర్టులో హాజరుపర్చనున్నారు. జగన్ అక్రమాస్తుల కేసులో సిబిఐ కోర్టుకు సమర్పించిన రెండు, మూడో ఛార్జీషీట్లపై విచారణ జరగనుంది. ఈ నేపథ్యంలో సిబిఐ కోర్టు వద్ద భారీగా బందోబస్తును ఏర్పాటు చేశారు.

కాగా చంచల్‌గూడ జైలు నుండి తనను సాధారణ బస్సులో తరలించడంపై జగన్ కోర్టులో అసహనం వ్యక్తం చేశారు. తనను సాధారణ బస్సులో తరలించారని, ఇది తనకు తీవ్ర అవమానమని జగన్ కోర్టులో అన్నారు. పోలీసుల ఓవరాక్షన్ వల్ల ఇబ్బందులు వస్తున్నాయన్నారు. ఇలాగే జరిగితే తాను జైలులోనే ఆమరణ నిరాహార దీక్షకు దిగుతానని చెప్పారు.

తాను పార్లమెంటు సభ్యుడిని అని, తనకు జెడ్ కేటగిరి భద్రత ఉందని ఆయన కోర్టులో మొరపెట్టుకున్నారు. అంతేకాకుండా ఓ పార్టీకి అధ్యక్షుడిని అని చెప్పారు. అలాంటి తనను మళ్లీ తిరిగి అదే వ్యానులో జైలుకు పంపితే వెళ్లేది లేదని చెప్పారు. తన నేరం రుజువు కాలేదని తాను నేరస్థుడిని కాదని కేవల ం నిందితుడిని మాత్రమే అని చెప్పారు. అలాంటి తనను సాధారణ బస్సులో తరలించడమేమిటన్నారు. జగన్ రాతపూర్వకంగా కోర్టుకు ఫిర్యాదు చేశారు.

జగన్ ఫిర్యాదు పరిశీలించిన కోర్టు తిరిగి కట్టుదిట్టమైన భద్రతతో వేరే వాహనంలో తరలించాలని పోలీసులను ఆదేశించింది. దీంతో జగన్‌ను చంచల్‌గూడ జైలుకు తీసుకు వెళ్లేందుకు బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని ఏర్పాటు చేశారు. సాధారణ వాహనంలో తరలింపుపై 14వ తేది లోపు వివరణ ఇవ్వాలని జైళ్ళ శాఖను కోర్టు ఆదేశించింది.

చంచల్‌గూడ జైలులో తన భార్య భారతితో వ్యక్తిగతంగా మాట్లాడే అవకాశం కల్పించాలని జగన్ కోర్టుకు విన్నవించారు. కాగా అధికారులు జగన్‌ను సాధారణ ఖైదీలతో పాటు జగన్‌ను బస్సులో తరలించారు. దీనిపై ఆయన కోర్టులో అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే అధికారులు మాత్రం తాము నిబంధనల ప్రకారమే వ్యాన్‌లో తరలించామని చెప్పారు. మరోవైపు కోర్టు జగన్‌కు ఈ నెల 25 వరకు జ్యూడిషియల్ రిమాండును పొడిగించింది.