పార్టీలే కాదు, పత్రికలూ భూస్థాపితం

పార్టీలే కాదు, పత్రికలూ భూస్థాపితం

తన సోదరుడు దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డిని దూషించే వారు భూస్థాపితం కాక తప్పదని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత, మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి సోమవారం అన్నారు. వైయస్ వివేకానంద రెడ్డి ఉదయం కడప జిల్లాలో మీడియాతో మాట్లాడారు. ఉప ఎన్నికలలో ప్రజలు పని చేసే వారికి పట్టం కట్టారని అన్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఘన విజయం సాధించడం సంతోషించదగ్గ విషయమని అన్నారు.

రాష్ట్రానికి ఒక మంచి దశ, దిశను చూపించిన దార్శనికుడు వైయస్ రాజశేఖర రెడ్డి అన్నారు. ఆయనను వదులుకున్న పార్టీకి ప్రజలు బుద్ధి చెబుతారన్నారు. వైయస్‌ను విమర్శించే పార్టీలకు, పత్రికలు సహా భూస్థాపితం కావడం ఖాయమన్నారు. కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలకు ప్రజలు బుద్ధి చెబుతారన్నారు.

కాగా  వైయస్ వివేకానంద రెడ్డి ఇటీవలి వరకు కాంగ్రెసు పార్టీలో ఉండి ఆ తర్వాత కడప ఎంపి వైయస్ జగన్మోహన్ రెడ్డి స్థాపించిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరారు. కొద్దికాలం ఆయన వ్యవసాయ శాఖ మంత్రిగా పని చేశారు. ఆ తర్వాత మంత్రి పదవికి రాజీనామా చేసి 2011లో జరిగిన ఉప ఎన్నికలలో పులివెందుల నుండి కాంగ్రెసు తరఫున వదిన వైయస్ విజయమ్మపై పోటీ చేసి ఓడిపోయారు.

అనంతరం నెల రోజుల కింది వరకు కాంగ్రెసులోనే కొనసాగారు. తన అన్న కాంగ్రెసువాది అని తాను ఆయన దారిలోనే నడుస్తానని అందుకే కాంగ్రెసులోనే ఉంటానని చెప్పారు. అయితే ఇటీవల కాంగ్రెసు నేతలు కొందరు వైయస్ పైన విమర్శలు చేయడం ఆయనను బాధించింది. దీంతో అతను పార్టీని వీడి జగన్ పార్టీలోకి జంప్ అయ్యారు.