క్రెడిట్ అంతా వైయస్ జగన్‌దే: షర్మిల

 క్రెడిట్ అంతా వైయస్ జగన్‌దే: షర్మిల

 ఉప ఎన్నికల ఫలితాలను చూస్తే దేవుడున్నాడని, అంతా చూస్తున్నాడని తేలిపోయిందని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ  అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి షర్మిల అన్నారు. తల్లి వైయస్ విజయమ్మతో కలిసి ఆమె శుక్రవారం చంచల్‌గుడా జైలులో జగన్‌ను కలిశారు. జగన్‌తో ములాఖత్ అనంతరం వారిద్దరు మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ఫలితాల పట్ల వారు ఎనలేని సంతృప్తిని వ్యక్తం చేశారు. ఫలితాల పట్ల వైయస్ జగన్ సంతోషం వ్యక్తం చేశారని,  జగన్ ఆనందంగా కనిపించారని షర్మిల అన్నారు.

వైయస్ రాజశేఖర రెడ్డి పేరును ఎఫ్ఐఆర్‌లో చేర్చారని, వైయస్ జగన్‌ను అన్యాయంగా జైలులో పెట్టారని ప్రజలు నమ్ముతున్నారని చెప్పడానికి ఉప ఎన్నికల ఫలితాలు నిదర్శనమని ఆయన అన్నారు. జగన్ నిర్దోషి అని ఉప ఎన్నికల ఫలితాలు రుజువు చేస్తున్నాయని ఆమె అన్నారు. జగన్ నాయకత్వం పట్ల ప్రజలు విశ్వాసం వ్యక్తం చేశారని, ప్రజలు రాజన్న రాజ్యం కోరుకుంటున్నారని తేలిపోయిందని ఆమె అన్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీని వైయస్ జగన్ స్థాపించారని, రెండేళ్లు పార్టీ కోసం కష్టపడ్డారని, ప్రస్తుత ఫలితాల క్రెడిట్ అంతా జగన్‌దేనని షర్మిల అన్నారు.

కొండా సురేఖ, ప్రసాదరాజు, తదితరుల గురించి వైయస్ జగన్ అడిగి తెలుసుకున్నారని ఆమె చెప్పారు. ఎంత మెజారిటీ వచ్చినా తమ పక్షాన నిలబడిన వారందరూ తమకు ముఖ్యమేనని, వారంతా రైతుల పక్షాన నిలబెడ్డారని జగన్ అన్నట్లు ఆమె తెలిపారు. తాము ఏ ఒక్కరిని కూడా దూరం చేసుకోబోమని ఆమె అన్నారు. న్యాయంగా అందరూ గెలిచినట్లేనని ఆమె అన్నారు. ప్రస్తుతం సాగుతున్నది ప్రజాస్వామ్యం కాదనే కసితో తమ పార్టీకి ప్రజలు ఓటేశారని ఆమె అన్నారు.

మీ కన్నీళ్లకు ఓట్లు వచ్చాయని అంటున్నారని మీడియా ప్రతినిధులు ప్రస్తావించగా తమకు ఓట్లు రావని వారు కూడా కన్నీళ్లు కార్చాల్సిందని ఆమె వ్యాఖ్యానించారు. త్వరలోనే వైయస్ జగన్ బయటకు వస్తారని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. దేవుడు చూస్తున్నాడని, జగన్‌ను దేవుడు బయటకు తీసుకుని వస్తాడని ఆమె అన్నారు. ఈ ఉప ఎన్నికలు కచ్చితంగా ప్రభుత్వంపై రెఫరెండమేనని ఆమె అన్నారు. 2014 ఎన్నికల్లో విజయం సాధించి జగన్ నాయకత్వంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధికారంలోకి వస్తుందని ఆమె అన్నారు. రాజన్న రాజ్యం వస్తుందని ఆమె అన్నారు.

ఇది ప్రజావిజయమని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మ అన్నారు. ఇది దేవుడిచ్చిన విజయమని ఆమె అన్నారు. వైయస్ పేరును ప్రజలు మరిచిపోలేదని చెప్పడానికి, జగన్‌ను ఆదరించారని చెప్పడానికి ఈ ఫలితాలను నిదర్శనమని ఆమె అన్నారు. జగన్ ముందుకు నడిపిస్తారని ప్రజలు నమ్ముతున్నట్లు ఆమె తెలిపారు.

విజయం కోసం పనిచేసినవారందరికీ హృదయపూర్వక కృతజ్ఝతలు చెబుతున్నానని జగన్ చెప్పారని షర్మిల అన్నారు. అంతా దేవుడు చూస్తున్నాడనేది జగన్ విశ్వాసమని ఆమె అన్నారు. ఈ విజయం ప్రజలదని జగన్ అన్నారని ఆమె అన్నారు.